Smoke Pan: ఏదైనా ఫంక్షన్లు లేదా వేడుకల సమయంలో పాన్లు తినడం పరిపాటి. పైగా షడ్రసోపేతంగా ఆహారం తిన్న తర్వాత పాన్ నమలడం ఆరోగ్యానికి మంచిదని.. దానివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుందని పెద్దలు అంటుంటారు. సంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన పాన్ తినడం ఆరోగ్యానికి మంచిదే. వాటిని మితంగా తింటేనే బాగుంటుంది.. మోతాదు మించితే తదుపరి పర్యవసనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.. మారుతున్న కాలానికి అనుగుణంగా పాన్ తయారీలో రకరకాల కొత్త పద్ధతులు పుట్టుకొచ్చాయి. అలాంటిదే ద్రవ నత్రజనితో తయారు చేసే పాన్.. స్థూలంగా చెప్పాలంటే స్మోకీ పాన్.. ఈ స్మోకి పాన్ ను యువత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. ఇలా ఓ స్మోకీ పాన్ తిన్న ఓ బాలిక తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
బెంగళూరు నగరానికి చెందిన అనన్య (పేరు మార్చాం) అనే 12 సంవత్సరాల బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి గత నెలలో బెంగళూరులోని ఓ ప్రాంతంలో ఓ వేడుకకు హాజరైంది. అక్కడ భోజనం తిన్న తర్వాత, స్మోకీ పాన్ ఆసక్తిగా అనిపిస్తే.. దానిని ఆరగించింది. తిన్న కొంతసేపటికే అనారోగ్యానికి గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు హెచ్ఎస్ఆర్ లే ఔట్ లోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు “పెర్ఫో రేషన్ పెరిటోనోటీస్” కు గురైందని నిర్ధారించారు. అది ఆమె కడుపులో రంధ్రానికి కారణమైందని ఒక స్పష్టతకు వచ్చారు.. ఆ తర్వాత ఆమెకు ఇంట్రా ఆప్ ఓజీడీ స్కోపీ, స్లీవ్ గ్యాస్ట్రోక్టమీ, లాపరోటమీ చేశారు. (ఇంట్రా ఆప్ ఓజీడీ స్కోపీ అనేది ఒక ఎండోస్కోపిక్ కెమెరా, లైట్ తో కూడిన ఫ్లెక్సిబుల్ ట్యూబ్. ఇది శస్త్ర చికిత్స సమయంలో అన్నవాహిక, ఉదరం, డ్యూ డెనమ్, చిన్న పేగు మొదటి భాగాన్ని పరిశీలించేందుకు వైద్యులు ఉపయోగిస్తారు) అనంతరం అనన్య ఉదరంలో 4*5 సెంటీమీటర్ల కొలతతో కొంత భాగాన్ని తొలగించారు. ఎందుకంటే లిక్విడ్ పాన్ వల్ల ఆ భాగం మొత్తానికి రంధ్రం పడింది. అది అనన్యకు విపరీతమైన కడుపునొప్పిని కలిగిస్తోంది.. శస్త్ర చికిత్స చేసిన అనంతరం వైద్య నిపుణులు దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ” పాన్ తయారీదారులు ద్రవనత్రజనిని ఉపయోగిస్తున్నారు. వీటిని తినేందుకు చాలామంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే అలాంటి పాన్ లు తినడం వల్ల ఆరోగ్యానికి చేటు కలుగుతోంది. ముఖ్యంగా ఉదర సంబంధ సమస్యలు వెలుగు చూస్తున్నాయి. వీటిని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కు దారి తీస్తాయి. సాధ్యమైనంతవరకు ద్రవ నత్రజనితో తయారైన పాన్ లు తినకపోవడమే మంచిది. దీనిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని” నారాయణ ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ విజయ్ పేర్కొన్నారు.. 2017లో గురు గ్రామ్ లో ఒక వ్యక్తి ద్రవ నత్రజని తో తయారైన కాక్టైల్ తాగిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడని.. ఆయన ఉదరంలో అనేక సమస్యలు వెలుగు చూశాయని విజయ్ కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ద్రవ నత్రజని శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..
స్మోకీ పాన్ తయారు చేసేందుకు 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 1:694 ద్రవ, వాయు నిష్పత్తిలో నత్రజనిని భద్రపరుస్తారు. దీని ద్వారా వెలువడే పొగలో పాన్ తయారుచేసి.. అందులో ఉంచుతారు. ఆ తర్వాత ద్రవ నత్రజని వల్ల వెలువడే పొగ పాన్ కు స్మోకీ ఫ్లేవర్ కలిగిస్తుంది. ఇది చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ.. తింటేనే అసలు సమస్యలు వస్తాయి. ఇది ఉదర సంబంధమైన వ్యాధులకు కారణమవుతుంది. చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ద్రవ నత్రజని ఆవిరి పీల్చడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాదు ఇది శరీరంలో కణజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎముకలకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది.. అన్నిటికంటే పేగులు, అన్నవాహిక, ఇతర జీర్ణావయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది.. అనన్య తిన్న పాన్ వల్ల ఆమె ఉదరంలో రంధ్రం ఏర్పడిందంటే.. ద్రవ నత్రజని ఎంత ప్రమాదకరమైందో ఊహించుకోవచ్చు.