Ebrahim Raisi: నాడు వైఎస్సార్‌..నేడు ఇబ్రహీం రైసీ.. ఆ హెలిక్యాప్టరే పొట్టన పెట్టుంది!

ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన హెలిక్యాప్టర్‌పై చర్చ జరుగుతోంది. బెల్‌ 212 రకానికి చెందిన హెలిక్యాప్టర్‌లో ఇబ్రహీం రైసీ ప్రయాణించారు. దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ఇరాన్‌ హోం మంత్రి అహ్మద్‌ వహీదీ తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : May 20, 2024 12:35 pm

Ebrahim Raisi

Follow us on

Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు అయతుల్లా సయ్యద్‌ ఇబ్రహీం రైసీ అల్‌ – సదటి హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇరాన్‌–అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన ఇబ్రహీం రైసీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి టెహ్రాన్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈస్ట్‌ అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌లోని వర్జాఖాన్‌ – జోల్ఫా మధ్య విస్తరించి ఉన్న దట్టమైన డిజ్మర్‌ అడవుల్లో హెలిక్యాప్టర్‌ క్రాష్‌ అయింది. ప్రమాద సమయంలో హెలిక్యాప్టర్‌లో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతోపాటు ఇరాన్‌ విదేశాంగ మంత్రి హోసైన్స్‌ అమీరబ్దుల్లాహియాన్, ఈస్ట్‌ అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ వారి భద్రతా సిబ్బంది తొమ్మిది మంది దుర్మరణం చెందారు.

అదే హెలిక్యాప్టర్‌..
ఇక ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన హెలిక్యాప్టర్‌పై చర్చ జరుగుతోంది. బెల్‌ 212 రకానికి చెందిన హెలిక్యాప్టర్‌లో ఇబ్రహీం రైసీ ప్రయాణించారు. దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ఇరాన్‌ హోం మంత్రి అహ్మద్‌ వహీదీ తెలిపారు. ప్రతీకూల వాతావరణం నేపథ్యంలో హెలిక్యాప్టర్‌ను ల్యాండ్‌ చేయడానికి యత్నిస్తున్న క్రమంలో దుర్ఘటన జరిగినట్లు తెలిపారు.

20 గంటల తర్వాత గుర్తింపు..
ఇక ప్రమాద స్థలాన్ని గుర్తించడం సహాయ సిబ్బందికి సవాల్‌గా మారింది. వర్షం, ప్రతీకూల వాతావరణంలో డ్రోన్లు, రెస్క్యూ సిబ్బంది సాయంతో గాలింపు చేపట్టారు. 20 గంటల తర్వాత హెలిక్యాప్టర్‌ శకలాలను గుర్తించారు. ఘటన స్థలికి చేరుకున్న 40 రెస్క్యూ బృందాలు పూర్తిగా ధ్వంసమైన హెలిక్యాప్టర్‌ను శరీర భాగాలను గుర్తించారు.

నాడు అదే బెల్‌ హెలిక్యాప్టర్‌..
2010లో పావురాల గుట్ట వద్ద హెలిక్యాప్టర్‌ క్రాష్‌ అయింది. ఈ ఘటనలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందారు. నాడు ఆయన ప్రయాణించిన హెలిక్యాప్టర్‌ కూడా బెల్‌ రకానికి చెందినదే. తాజాగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలిక్యాప్టర్‌ కూడా బెల్‌ 212 రకానికి చెందినదే. నాడు ప్రతికూల వాతావరణం కారణంగానే హెలిక్యాప్టర్‌ కూలిపోయింది. నాటి ఘటనను గుర్తుచేసేలా ఇప్పుడు ఇరాన్‌లో కూడా అచ్చం అలాగే జరిగింది. ఈ ఘటనలో ఆదేశ అధ్యక్షుడు దుర్మరణం చెందారు. వైఎస్సార్‌ను, ఇబ్రహీం రైసీని పొట్టన పెట్టుకున్నది బెల్‌ 212 రకం హెలిక్యాప్టరే కావడం గమనార్హం. గతేడాది దుబయ్‌లో బెల్‌ 212 కూలింది. 2018లో కూడా బెల్‌ హెలిక్యాప్టర్‌ క్రాష్‌ అయింది.

ఇజ్రాయెల్‌పై అనుమానాలు..
ఇదిలా ఉంటే.. ఇరాన్‌ అధ్యక్షుడి క్రాష్‌ వెనుక ఇజ్రాయెల్‌ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడి హెలిక్యాప్టర్‌ క్రాష్‌ కావడంతో ఇరాన్‌ ఆర్మీ ఇజ్రాయెల్‌పై అనుమానం వ్యక్తం చేస్తోంది. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రమాదంపై విచారణకు సైన్యం రంగంలోకి దిగింది.