Hyderabad : హైదరాబాద్‌లో రూ.700 కోట్ల భారీ మోసం.. 30 వేల మంది బాధితులు.. అసలేం జరిగిందంటే?

అధిక వడ్డీల పేరుతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మోసాలు పెరుగుతున్నాయి. పెట్టుబడుల రూపంలో నగదు స్వీకరించి.. అధిక వడ్డీ ఇస్తామని కొన్ని రోజులు డబ్బులు చెల్లించి.. తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. తాజాగా ఇలాంటి భారీ మోసం హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

Written By: Raj Shekar, Updated On : September 14, 2024 3:16 pm

DKZ Solution In Hyderabad

Follow us on

Hyderabad :  ఈజీ మనీ అంటే మనోళ్లు అప్పులు చేసైనా పెట్టుబడి పెడుతున్నారు. ఇలాంటి వారు ఉన్నంతకాలం.. మోసం చేసేవాళ్లూ ఉంటారు. అనేక కంపెనీలు అధిక వడ్డీల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో వెలుస్తున్నాయి. ప్రజలను నమ్మించి డిపాజిట్లు సేకరిస్తున్నాయి. ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా డబ్బులు వస్తుండడంతో చాలా మంది అధిక వడ్డీ ఆశకుపోయి డిపాజిట్లు చేస్తున్నారు. కొందరైతే అప్పులు తెచ్చి మరీ డిపాజిట్‌ చేస్తున్నారు. అయితే చివరకు సంస్థలు బోర్డు తిప్పేశాక లబోదిమో మంటున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. కఠిన చర్యలు చేకపోవడంతో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఓ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. మోసపోయిన బాధితులు ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు.

ఎక్కువ వడ్డీ ఇస్తామని..
డీకేజీ (డీకేజెడ్‌)టెక్నాలజీస్‌ అనే సంస్థ ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. దీంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన సుమారు 30 వేల మంది ఇందులో పెట్టుబడి పెట్టారు. సుమారు రూ.700 కోట్లు వసూలు చేసిన కంపెనీ ఇప్పుడు బోర్డు తిప్పేసింది. మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయాన్ని మూసివేయంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పెట్టుబడిపై 8 నుంచి 12 శాతం వడ్డీ ఇస్తామని కంపెనీ ప్రతినిధులు ప్రజలను నమ్మించారు. దీంతో చాలా మంది పెట్టుబడి పెట్టారు. కంపెనీ మొదట వడ్డీ సరిగానే చెల్లించింది. దీంతో పెట్టుబడిదారులు పెరిగారు.

మూడు నెలలుగా నిలిచిన చెల్లింపులు..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జూన్‌ నుంచి కంపెనీ చెల్లింపులు నిలిపివేసింది. దీంతో బాధితులు కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. కొంతమంది తాము కంపెనీలో 2018 నుంచి పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. కానీ చివరకు కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో మోసపోయామని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 403, 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం సెంట్రల్‌ క్రై మ్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌ యాదవ్‌కు అప్పగించారు.