New Delhi : పొత్తిళ్లలో పాపాయి మిస్సింగ్.. విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు

పొత్తిళ్లలో సేద తీరుతూ.. తల్లి పాలు తాగుతూ.. ఆమె ఒడిలో వెచ్చగా నిద్ర పోవలసిన ఓ ఆడ శిశువు కనిపించకుండా పోయింది. ఈ ఫిర్యాదు పోలీసుల దాకా వచ్చింది. వివరాలు తెలుసుకొని వారు దర్యాప్తు మొదలుపెడితే దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూసాయి. ఆ తర్వాత షాక్ కు గురికావడం పోలీసుల వంతయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 2, 2024 1:54 pm

Delhi Women

Follow us on

New Delhi  : ఢిల్లీ ప్రాంతానికి చెందిన వివాహిత (28) తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఈ దంపతులకు ఇంతకుముందే ముగ్గురు ఆడపిల్లలు. ప్రస్తుతం వారి వయసు 6, 4, 2 సంవత్సరాలు. తమ వంశాన్ని నిలబెట్టేందుకు ఒక కుమారుడు కావాలని.. వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. 9 నెలల క్రితం ఆ వివాహిత గర్భం దాల్చింది. ఈసారి ఎలాగైనా అబ్బాయి పుడతాడని ఆ దంపతులు భావించారు. ఇటీవల ఆమె ప్రసవించింది. నాలుగోసారి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆమె పట్టరాని బాధతో ఉంది. అయిష్టంగానే తన పాపకు పాలు ఇస్తోంది. ఇటీవల నాలుగో సంతానం కూడా ఆడ శిశువు జన్మించిందని భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఈ సృష్టిలో ఏ తల్లి చేయని పాపానికి ఆ మాతృమూర్తి ఒడిగట్టింది. భర్త లేని సమయంలో ఆ చిన్నారి గొంతును నలిమి చంపేసింది.

ఇంటిపై గుడ్డ సంచిని చూసి

అలా ఆ పాపను చంపిన తర్వాత.. మృతదేహాన్ని సంచిలో మూట కట్టింది. ఈ విషయం భర్తకు తెలియడంతో అతడు నోరు మెదపలేదు. అయితే ఇరుగుపొరుగువారు అడగడంతో ఆమె పొంతనలేని సమాధానం చెప్పింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన శిశువును ఎవరో ఎత్తుకెళ్లిపోయారంటూ వారి ముందు విలపించింది. ఆరు రోజుల శిశువు కావడంతో పోలీసులు కూడా ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు. వారికి తెలిసిన కోణాలలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. బాధితురాలితో మాట్లాడారు..” రాత్రి నా బిడ్డకు పాలు పట్టాను. తెల్లవారి లేచి చూడగా నా పక్కలో లేదని” ఆమె సమాధానం చెప్పింది. అయితే ఆమె చెప్పిన సమాధానం పొంతన లేకుండా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు. చుట్టుపక్కల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. అయితే సమీపంలో ఓ ఇంటి పైకప్పు లో ఒక సంచి గుర్తించారు. అందులో దుర్వాసన వస్తున్న గుర్తించారు. అయితే ఆ చిన్నారిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ చిన్నారి తల్లిని విచారించగా.. చివరి కామె తన తప్పు ఒప్పుకుంది. నాలుగు సంతానంగా కూడా ఆడపిల్ల జన్మించడంతో.. తాను ఈ దారుణానికి పాల్పడినట్టు వెల్లడించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. కాగా, నేటి కంప్యూటర్ కాలంలోనూ తల్లిదండ్రులు వారసులు కావాలని ఆడపిల్లలను చంపడం దారుణమని.. ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ ఆలోచన ధోరణిని మార్చుకోవాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.