CID Chief  : నాడు అరెస్టులు వద్దన్న సిఐడి చీఫ్.. అయినా జగన్ వినలే.. ఆ 19 మంది ఐపీఎస్ లది అదే వ్యధ!

ప్రభుత్వాలు మారితే ఎక్కడైనా ప్రత్యర్థులపై దృష్టి పెడతారు.నాయకులపై కేసులు నమోదు చేస్తారు. కానీ ఏపీలో నేతలకంటే అధికారులే టార్గెట్ కావడం విశేషం.

Written By: Dharma, Updated On : September 2, 2024 1:36 pm

CID Chief

Follow us on

CID Chief  :  ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది అధికారులపై వేటువేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించారన్నది వారిపై ఉన్న ఆరోపణ. దాదాపు 19 మంది ఐపీఎస్ అధికారులను పెట్టింది కూటమి ప్రభుత్వం. వారిని డిజిపి కార్యాలయానికి సరెండర్ చేసింది. ప్రతిరోజు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు డిజిపి కార్యాలయంలో ఉండాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అధికారులు పాటించడం లేదు. కొంతమంది సెలవులోకి వెళ్లిపోయారు. ఇంతలో ఇలా సరెండర్ చేసిన అధికారుల్లో ముగ్గురిపై కేసులు కూడా నమోదయ్యాయి. అందులో ఒకరు ఒకనాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును అక్రమంగా అరెస్టు చేసి తీసుకొచ్చారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. రఘురామకృష్ణం రాజు పై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై రఘురామకృష్ణం రాజు ఇటీవల గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నాడు సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ పై కేసు నమోదయ్యింది. అయితే వైసిపి హయాంలో అక్రమ అరెస్టులు వద్దని చెప్పిన అధికారుల్లో సునీల్ కుమార్ ఒకరట. ఈయన జగన్ అస్మదీయ అధికారి. అయితే అరెస్టుల విషయంలోసలహాలు ఇవ్వడంతో జగన్ కు నచ్చలేదట. అందుకే అప్పట్లో సిఐడి చీఫ్ పదవి నుంచి తొలగించారట.

* అప్పట్లో చురుకైన అధికారిగా
సునీల్ కుమార్ సిఐడి చీఫ్ గా వ్యవహరించేవారు. అప్పట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా వైసిపి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ఉద్యమమే ఎగసింది. ఆ సమయంలో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ క్రియాశీలకంగా వ్యవహరించారు. అటు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై సైతం ప్రతాపం చూపారు. కానీ జగన్ సర్కార్ టిడిపి ప్రభుత్వ హయాంలో నిఘా చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో వ్యవహరించిన తీరును తప్పుపట్టారు.చంద్రబాబు అరెస్టు చేద్దామన్న ప్రతిపాదనను కూడా వ్యతిరేకించారు. దీంతో నాడు సునీల్ కుమార్ ను సిఐడి చీఫ్ పదవి నుంచి గత ఏడాది జనవరి 23న తొలగించారు. ఏకంగా జీఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

* జగన్ కు వివరించే ప్రయత్నం చేసినా
అయితే నాడు ఏపీ సీఎం జగన్ కు సునీల్ కుమార్ చాలా రకాలుగా వివరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గాని తాము అరెస్టులతో పాటు ప్రతీకార చర్యలకు పాల్పడితేతప్పకుండా మూల్యం చెల్లించుకుంటామని.. ప్రభుత్వం మారిన వెంటనే తాము బాధ్యులవుతామని సునీల్ వాదించినట్లు సమాచారం. అప్పట్లో జగన్ కు ఈ మాటలు నచ్చలేదు. అరెస్టులు చేయకపోతే ఆ పోస్టులో ఉండడం దండగ అని.. సునీల్ కుమార్ ను సిఐడి చీఫ్ పదవి నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అయితే నాడు సునీల్ కుమార్ అనుమానమే ఇప్పుడు నిజమైంది. నాడు ఎవరెవరైతే వైసిపి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించారో.. అటువంటి అధికారులే ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.

* వెంటాడుతున్న కూటమి ప్రభుత్వం
అయితే వైసిపి ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ తో పాటు సిఐడి విభాగం అధిపతులను, ఆ విభాగాల్లో పని చేసిన అధికారులను ఇప్పుడు బాధ్యులు చేస్తూ కూటమి ప్రభుత్వం వెంటాడుతోంది. ఓ ముగ్గురు అధికారులపై కేసులు కూడా నమోదు చేసింది. మరికొందరిపై కేసుల కత్తి వేలాడుతోంది. నాడు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మాదిరిగా జగన్ ప్రభుత్వ చర్యల నుంచి తప్పుకొని ఉంటే తమకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అన్న కామెంట్స్ బాధిత అధికారుల నుంచి వినిపిస్తోంది. మొత్తానికైతే నాడు ఐపీఎస్ అధికారి సునీల్ వాదనను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకు ఇప్పుడు కొందరు అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.