https://oktelugu.com/

Kurnool : చెరువులో నిండా నీళ్లు.. అందులో మూడు మృతదేహాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

పోలీసులు జాగిలాలను తీసుకొచ్చి ఆ ప్రాంతం మొత్తం పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2024 / 04:33 PM IST

    Kurnool, Gargeyapuram pond

    Follow us on

    Kurnool : అది కర్నూలు జిల్లా లోని కర్నూలు నగరం.. ఆ నగరం పరిధిలో గార్గేయపురం అనే ఊర చెరువు ఉంది. ఈ చెరువు నీరు ఆధారంగా వందల ఎకరాల్లో పంటలు పండుతాయి. ఆ చెరువు నీటిని శుద్ధి చేసి కర్నూలులోని కొన్ని ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తారు. ఆ చెరువుకు ఎంతో పేరుంది. ప్రస్తుతం వేసవికాలం అయినప్పటికీ.. ఆ చెరువులో నిండా నీరు ఉంది. ఆ చెరువు కట్టను వాకింగ్ ట్రాక్ గా రూపొందించడంతో.. చాలామంది ఉదయం వాకింగ్ చేస్తుంటారు. అయితే అలా వాకింగ్ చేస్తుండగా ఆదివారం ఉదయం కొంతమందికి షాకింగ్ దృశ్యం కనిపించింది. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేయగా.. వారు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడి దృశ్యాలను చూసి వారు కూడా షాక్ కు గురయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే..

    కర్నూలు నగరంలోని గార్గేయపురం చెరువులో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. వాటిని వెలికి తీసి పరిశీలించగా.. వారంతా ట్రాన్స్ జెండర్లు అని తేలింది. ముందుగా స్థానికులు చెరువులో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు ఆ ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగా.. మరో మృతదేహం చెరువు ఒడ్డున కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం నెలకొంది. ఈ ప్రాంతంలో ట్రాన్స్ జెండర్ల అలికిడి కూడా పెద్దగా ఉండదు. పైగా ఈ ప్రాంతం అత్యంత నిర్మానుష్యంగా ఉంటుంది. ఇలాంటి చోట ఆ ముగ్గురు ఎందుకు చనిపోయారనేది అంతుపట్టడం లేదు.

    ఎంతో ప్రశాంతంగా ఉండే గార్గేయపురం పరిసర ప్రాంతాల్లో.. మూడు మృతదేహాలు కనిపించడం సంచలనంగా మారింది. వాస్తవంగా ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోలేదు. తాగునీటి చెరువులో మూడు మృతదేహాలు కనిపించడం సంచలనంగా మారింది. అయితే మృతిచెందిన ఆ ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఎవరు? ఎందుకు చనిపోయారు? ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో.. ఎలా చనిపోయారనే విషయం మిస్టరీగా మారింది. పోస్టుమార్టం నిమిత్తం మూడు మృతదేహాలను పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ముగ్గురు ట్రాన్స్ జెండర్ల మృతదేహాలను, ఇతర ట్రాన్స్ జెండర్లకు చూపించగా వారు గుర్తుపట్టలేదు. పోలీసులు జాగిలాలను తీసుకొచ్చి ఆ ప్రాంతం మొత్తం పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.