Crime News: ప్రేమ వివాహం వద్దనందుకు ఉన్మాదిలా మారిన యువకుడు.. చివరకు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

ప్రేమ వివాహం వద్దన్నందుకు ఓ యువకుడు ఉన్మాదిలాగా మారిపోయాడు. చేయరాని పని చేశాడు. అతడు పాల్పడిన ఘాతుకానికి ఒక కుటుంబం దిక్కులేనిదయిపోయింది. ఓ యువతి కన్న తల్లిదండ్రులను కోల్పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో బానోత్ శ్రీనివాస్ (45), బానోత్ సుగుణ (40) దంపతులు. వీరికి బాబు, పాప సంతానం.

Written By: Bhaskar, Updated On : July 11, 2024 2:54 pm

Couple Allegedly Killed in Narsampet of Warangal

Follow us on

Crime News: ప్రేమ.. ఈ రెండు అక్షరాల పదం ఎంతో గొప్పది. ఆ నిర్వచనీయ అనుభూతులను అందిస్తుంది. భిన్న ధ్రువాలకు చెందిన మనసులను ఏకం చేసి, మనుషులను కలుపుతుంది. అందుకే నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ఈ సువిశాల సృష్టిలో ఎంతోమంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు, మరెన్నో బాధలను అనుభవించారు. చివరికి ప్రేమ ద్వారా ఒకటయ్యారు. వారి ప్రేమ ద్వారా ప్రపంచానికి సరికొత్త అనుబంధాలను పరిచయం చేశారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమ కూడా ఒక ఇన్స్టంట్ వస్తువు లాగా రూపాంతరం చెందుతోంది. పైగా ప్రేమలో నిజాయితీ లేక క్షణకాలం అపార్ధాలు, ఆవేశాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలలో తీరని దుఃఖాన్ని మిగుల్చుతున్నాయి.

ప్రేమ వివాహం వద్దన్నందుకు ఓ యువకుడు ఉన్మాదిలాగా మారిపోయాడు. చేయరాని పని చేశాడు. అతడు పాల్పడిన ఘాతుకానికి ఒక కుటుంబం దిక్కులేనిదయిపోయింది. ఓ యువతి కన్న తల్లిదండ్రులను కోల్పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో బానోత్ శ్రీనివాస్ (45), బానోత్ సుగుణ (40) దంపతులు. వీరికి బాబు, పాప సంతానం. వీరిలో కుమార్తె దీపిక డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. దీపిక గుండెంగ గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడితో ప్రేమలో పడింది. రెండు సంవత్సరాలుగా వీరి వ్యవహారం కొనసాగుతోంది. ఇతడి ప్రేమ వ్యవహారం తెలియడంతో దీపికను ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఇదే విషయాన్ని బన్నీతో దీపిక చెప్పింది. దీంతో వారిద్దరూ గత ఏడాది నవంబర్ నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు. ఆ సమయంలో పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ యువతిని ఆమె తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి దీపిక తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఇటీవలే వారు ఆమెను పై చదువుల నిమిత్తం హనుమకొండ పంపించారు. అక్కడ ఒక కళాశాలలో దీపిక డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది.

కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం, అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో సుగుణ, శ్రీనివాస్ నిత్యం అదే విషయాన్ని తలుచుకొని తలడిల్లి పోయేవారు. ఇదే క్రమంలో దీపికకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన బన్నీ ఆగ్రహంతో రగిలిపోయాడు. గురువారం పదహారు చింతల తండాకు వెళ్ళాడు. శ్రీనివాస్, సుగుణ ఇంట్లోకి ప్రవేశించి వారితో గొడవ పెట్టుకున్నాడు. వెళ్తూ వెళ్తూ ఒక పదునైన ఆయుధాన్ని తన వెంట తీసుకెళ్లాడు. దాంతో శ్రీనివాస్, సుగుణపై దాడి చేశాడు. ఈ దాడిలో సుగుణ అక్కడికక్కడే చనిపోయింది. శ్రీనివాస్ తీవ్ర గాయాల పాలయ్యాడు. శ్రీనివాస్ – బన్ని మధ్య పెనుగులాటకు చుట్టుపక్కల వారు లేచారు. వెంటనే శ్రీనివాస్ ను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

బన్నీ పదునైన ఆయుధంతో దాడి చేయడంతో సుగుణ తీవ్రంగా గాయపడింది. ఆమెకు అధికంగా రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే కన్ను మూసింది. ఇక శ్రీనివాస్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో, రక్తస్రావం అధికమైంది. శరీరంలో ముఖ్యమైన భాగాలకు అంతర్గత గాయాలు కావడంతో అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే బన్నీ శ్రీనివాస్, సుగుణ మాత్రమే కాకుండా దీపిక సోదరుడు మదన్ లాల్ పై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పదహారు చింతల తండాకు చేరుకున్నారు. నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, నెక్కొండ సీఐ చంద్రమోహన్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.. చెన్నారావుపేట, గూడూరు, నెక్కొండ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బన్నీ పాల్పడిన ఘాతుకానికి ఒక కుటుంబం సర్వనాశనమైంది. అయితే అతని కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు శ్రీనివాస్ బంధువులు బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం బన్నీ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.