CJ Roy Passed Away: కాన్ఫిడెంట్ రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ సీజే రాయ్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వందల కోట్ల వ్యాపార సంస్థలకు అధిపతిగా కొనసాగుతున్న ఆయన ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.. వాస్తవానికి ఆయనకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు. పైగా ఆయన నిర్వహిస్తున్న సంస్థలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఆయన ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
సీజే రాయ్ కాన్ఫిడెంట్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఈయన వందల కోట్ల విలువైన ఫ్లాట్లు.. ప్లాట్లు నిర్మించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కూడా రియల్ ఎస్టేట్ కార్యాలపాలు సాగిస్తున్నారు. హైదరాబాదులో కూడా కొన్ని సంస్థలలో పెట్టుబడులు పెట్టారు. విదేశాలలో కూడా వ్యవహారాలను సాగిస్తున్నారు. కేరళలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నప్పటికీ సిజే రాయ్ బెంగళూరులో నివాసం ఉంటారు. బెంగళూరు నగరంలోని రిచ్ సర్కిల్లో ఉన్న ల్యాంగ్ ఫర్డ్ రోడ్డులో ఆయనకు అత్యంత విలాసవంతమైన భవనం ఉంది.. ఆ భవనంలో ఆయన రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక కీలకనిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
సీజే రాయ్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఐటీ అధికారుల దాడులే కారణమని తెలిసింది.. శుక్రవారం మధ్యాహ్నం ఐటీ శాఖ అధికారులు వచ్చి కాన్ఫిడెంట్ సంస్థలలో దాడులు మొదలుపెట్టారు. గంటకు పైగా రాయ్ ని విచారించారు. అతని కొద్దిసేపటికి తుపాకీతో కాల్చుకున్నారు. కంపెనీ సిబ్బంది వెంటనే ఆయనను నారాయణ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయారు..
రాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈయనకు మన దేశంలోనే కాకుండా దుబాయ్, ఇతర దేశాలలో భారీగా ఆస్తులు ఉన్నాయి. 2025 లో ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన వందమంది వ్యాపారవేత్తల్లో ఈయన కూడా చోటు దక్కించుకున్నారు. అయితే పన్నులు ఎగవేశారని ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు ఈయన కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటి శాఖ అధికారులపై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గిట్టని వ్యక్తులపై ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి చెప్పినట్టుగా ఐటి శాఖ అధికారులు నడుచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.