https://oktelugu.com/

Chennai: అమ్మ పాలను అమ్ముకుంటున్నారు.. ఏంటీ దారుణం!

మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తల్లిపాల వ్యాపారంపై నిషేధం విధించాయి. అయినా కొందరు అక్రమంగా ఈ దందా నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నైవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 2, 2024 12:14 pm
    Chennai

    Chennai

    Follow us on

    Chennai: ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నా.. కొనలేనిది తల్లి ప్రేమ, తల్లి పాలు అంటారు. కానీ, చెన్నైకి చెందిన జాదూగాళ్లు అమ్మపాలతో కూడా వ్యాపారం చేస్తున్నారు. తమకు డబ్బులే ముఖ్యం అన్నట్లు తల్లిపాలను 200 మిల్లీ లీటర్ల బాటిళ్లలో నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ఒక్కో బాటిల్‌ను రూ.1000 చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా.. తమిళనాడు రాజధాని చెన్నైలో బయటపడింది.

    నిషేధం ఉన్నా..
    మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తల్లిపాల వ్యాపారంపై నిషేధం విధించాయి. అయినా కొందరు అక్రమంగా ఈ దందా నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నైవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నైలోని మాధవరంలో ముత్తయ్యకు చెందిన ఓ వ్యాక్సిన్‌ స్టోర్‌పై దాడి చేసిన ఉన్నతాధికారులు తల్లి పాలను విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రోటీన్‌ పౌడర్‌ విక్రయానికి లైసెన్స్‌ తీసుకుని ఆ ముసుగులో తల్లిపాలను విక్రయిస్తున్నట్లు ధ్రువీకరించారు. ఈ సందర్భంగా 50 బాటిళ్ల తల్లిపాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని గిండీలోని కింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌కు పంపించారు.

    ఎక్కడ సేకరిస్తున్నారు?
    ముత్తయ్య తల్లిపాలను ఎలా సేకరిస్తున్నారు.. ఎన్ని రోజుల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు అనేదానిపై అధికారులు దృష్టిసారించారు. ఈమేరకు తల్లి పాలను దానం చేసే మహిళల పేర్లు, ఫోన్‌ నంబర్లతో కూడిన ఓ బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. తల్లిపాల విక్రయాలపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిషేధం విధించిందని అధికారులు తెలిపారు. తల్లిపాలను దీర్ఘకాలం నిల్వ చేయడం వల్ల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. పాలలో ఉండే సహజ ప్రోటీన్లు కూడా నశిస్తాయని పేర్కొన్నారు. ఈ కారణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తల్లిపాలను నిల్వ చేసి అమ్మడాన్ని నిషేధించారని తెలిపారు.