Anantapur
Anantapur: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం(Erstwhile Ananthapuram) జిల్లాలో గుత్తి(Gutti) పట్టణం ఉంది. ఈ పట్టణంలో నివాసం ఉండే ఓ యువతీ యువకుడు ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ స్థానికంగా ఉన్న ఒక కాలేజీలో చదువుతున్నారు. ఐతే ఇటీవల వారిద్దరి మధ్య ఒక విషయంపై వాగ్వాదం జరిగింది. ఇద్దరు తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ అమ్మాయి కాస్త పరుషంగా మాట్లాడటంతో ఆ అబ్బాయి మనో వేదనకు గురయ్యాడు. ” ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే ఇలాంటి మాటలు అంటుందా.. నన్ను ఇంతలా అవమానిస్తుందా.. అసలు ఈమె ప్రేమ నాకు అవసరమా..ఇలాంటి మనిషిని నేను ఎందుకు ప్రేమించాలి.. జీవితాంతం ఇలాంటి మనిషితో ఎలా వేగాలి” అని ఆయోగుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు. అంతే ఇక జన్మలో ఆ అమ్మాయి ముఖం చూడొద్దు అనుకున్నాడు. కనీసం మాటలు కూడా మాట్లాడొద్దని నిర్ణయించుకున్నాడు. వాటిని అమలులో పెట్టాడు. అంతేకాదు ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్ లో పెట్టాడు.
పోలీసులను ఆశ్రయించింది
ప్రేమికుడితో గొడవ జరిగిన కొద్ది రోజుల వరకు ఆ అమ్మాయి కూడా పట్టుదలతోనే ఉంది. అయితే రోజులు గడుస్తున్నా కొద్ది ఆమె తన కోపాన్ని తగ్గించుకుంది. తనే నానా మాటలు అన్నానని బాధపడి.. అతడికి క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించింది. అతడికి ఫోన్ చేసినప్పటికీ బ్లాక్ లో పెట్టడంతో ఉపయోగం లేకుండా పోయింది. వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసినా అతడు ఎత్తలేదు. దీంతో విరహవేదనతో ఆమె పోలీసులకు ఈ విషయాలు చెప్పాలని భావించింది. ఇందులో భాగంగా డయల్ 100 కి కాల్ చేసింది. జరిగిన ఘటన మొత్తం చెప్పింది..” నా బాయ్ ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు. నా నెంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడాలి. నా నెంబర్ అన్ బ్లాక్ చేయించాలని” చెప్పింది.. దీంతో గుత్తి బ్లూ కోల్ట్ స్ పోలీసులు తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను సంప్రదించారు. అయితే ఆమె నా ఇంటికి రావద్దని పోలీసులకు సూచించింది. అంతే కాదు బాయ్ ఫ్రెండ్ తన ఫోన్ నెంబర్ అన్ బ్లాక్ చేస్తే చాలని చెప్పింది. అయితే వారు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమెకు సూచించారు. ఈ సంఘటన గుత్తి పట్టణంలో సంచలనానికి కారణమైంది. పోలీసులు సూచించినట్టు ఆమె ఫిర్యాదు చేసిందా? వారు రంగంలోకి దిగి ఆ యువకుడిని పిలిపించి నెంబర్ అన్ బ్లాక్ చేయించారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే దీనిపై పోలీసులను సంప్రదిస్తే ఆ యువతి తమకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.