Bank Manager Fraud 4.8 Crores : ఎక్కువ వడ్డీ ఏ బ్యాంకు కల్పిస్తే.. ఆ బ్యాంకులో డబ్బులు దాచుకుంటారు.. కస్టమర్లు తమను నమ్మి బ్యాంకులలో దాచుకున్న డబ్బులకు అందులో పనిచేసే ఉద్యోగులు భరోసాగా ఉండాలి. నమ్మకంగా ఆ డబ్బును పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ ఆ నమ్మకాన్ని ఓ బ్యాంకు మేనేజర్ వమ్ము చేసింది. భద్రంగా ఉండాల్సిన చోట తానే ఓ దొంగ అవతారం ఎత్తింది. చివరికి కస్టమర్ల సొమ్మును కాజేసింది. రెండో కంటికి తెలియకుండా దోచేసింది. దర్జాగా ఆ డబ్బుతో రకరకాల వ్యాపారాలు మొదలుపెట్టింది. ఈలోపు ఒక కస్టమర్ వచ్చి తన నగదు తనకు ఇవ్వాలని కోరితే డొంక తిరుగుడు సమాధానం చెప్పింది. అనుమానం వచ్చిన కస్టమర్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయగా అమ్మగారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
మనదేశంలో పేరుపొందిన ప్రైవేట్ బ్యాంకులలో ఐసిఐసిఐ కూడా ఒకటి. ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా శాఖలు ఉన్నాయి. రాజస్థాన్లోని కోట ప్రాంతంలో కూడా శాఖ ఉంది. అయితే ఈ బ్యాంకులో చాలామందికి డిపాజిట్లు ఉన్నాయి. వడ్డీ రేటు ప్రభుత్వ బ్యాంకులతో పోల్చి చూస్తే కాస్త ఎక్కువ కావడంతో సీనియర్ సిటిజెన్లు ఇక్కడే తమ డబ్బును భద్రంగా దాచుకుంటున్నారు.. ఆ సీనియర్ సిటిజెన్లు దాచుకున్న డబ్బు కోట్లలో ఉండడంతో అక్కడ పనిచేస్తున్న బ్యాంకు మేనేజర్ కు దురాశ పుట్టింది.. ఆ డబ్బులు కాజేసీ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచన పుట్టింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ.. నిల్వ ఉన్న నగదును ఏకపక్షంగా తీసుకుంటే చేస్తే కస్టమర్లకు తెలుస్తుందని భావించి… సరికొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది.. ముందుగా ఆ కస్టమర్ల సంతకాలు ఫోర్జరీ చేసింది. వారి చరవాణి నంబర్లను మార్చింది. తన దగ్గర ఉండే ఫోన్ నెంబర్లను ఎంటర్ చేసింది. దీంతో మేడం గారు అక్కడే దొరికిపోయింది. ఆ తర్వాత 41 కస్టమర్ల ఖాతాల నుంచి 4.8 కోట్లు డ్రా చేసి వ్యాపారాలు మొదలుపెట్టింది.
ఆ బ్యాంకులో కోటికి పైగా నగదు నిల్వ ఉన్న ఒక కస్టమర్ ఇటీవల వచ్చాడు. ఆ డబ్బును కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ఉపయోగించాలని భావించాడు. డబ్బులు డ్రా చేస్తానని ఆ సదరు బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లడంతో.. ఆమె తొలుత బుకాయించింది. ఆ తర్వాత వడ్డీ రేటు మరింత ఎక్కువ ఇస్తామని ఆశ పెట్టింది. దానికి ఆ కస్టమర్ ఒప్పుకోలేదు. ఇలా రోజుల తరబడి తిరిగినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో విసిగి వేసారిన ఆ కస్టమర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నతాధికారులను కలిశారు. దీంతో బాగా రంగంలోకి దిగి ఆ కస్టమర్ ఎకౌంటు చెక్ చేయగా.. అందులో బ్యాలెన్స్ కనిపించలేదు. దీంతో ఫ్రాడ్ జరిగిందని భావించిన అధికారులు ఆడిటింగ్ మొదలుపెట్టారు. ఎంక్వయిరీలో ఆ డబ్బులు సదరు బ్యాంకు మేనేజర్ డ్రా చేసింది అని తేలింది. ఇలా మొత్తంగా 41 కస్టమర్ల నుంచి కోట్లల్లో డ్రా చేసిందని సమాచారం. అయితే ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆర్థిక మోసం నేపథ్యంలో ఆమె నుంచి డబ్బులను రికవరీ చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేదని భరోసా ఇస్తున్నారు. అయితే సదరు బ్యాంకు మేనేజర్ సాగించిన ఈ వ్యవహారం ఇటీవల దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ అనే తెలుగు సినిమాను పోలి ఉండడం విశేషం.. ఈ సినిమాలో కూడా బ్యాంకింగ్ ఫ్రాడ్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.