Aswaraopeta: అశ్వారావుపేట పోలీస్ సర్కిల్ ను వీడని విషాదాలు.. మొన్న ఓ ఎస్ఐ ఆత్మహత్య.. నేడు మరో ఎస్ఐ..

Aswaraopeta: కానిస్టేబుళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసింది. శ్రీను భార్య ఫిర్యాదు నేపథ్యంలో వీరిపై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. శ్రీను ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా..

Written By: Anabothula Bhaskar, Updated On : July 10, 2024 6:48 pm

Another SI died of heart attack in Aswaraopeta police circle

Follow us on

Aswaraopeta: సీఐ వేధింపులు, కానిస్టేబుళ్ల సూటిపోటి మాటలు తట్టుకోలేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఆదివారం కన్నుమూశాడు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డి, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నలుగురు కానిస్టేబుళ్ల పై వేటు వేసింది. సీఐ ని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసింది. కానిస్టేబుళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసింది. శ్రీను భార్య ఫిర్యాదు నేపథ్యంలో వీరిపై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. శ్రీను ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఆ ఘటన జరిగి సరిగ్గా మూడు రోజులు గడవకముందే మరో దారుణం చోటుచేసుకుంది.

అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో దమ్మపేట మండలంలో ఎస్ఐగా పని చేస్తున్న సీమా నాయక్ గుండెపోటుతో మృతిచెందారు. ఖమ్మం నగరంలో ఆయన తన బంధువుల ఇంట్లో ఉండగా.. బుధవారం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన నేపథ్యంలో అశ్వారావుపేట పోలీస్ సర్కిల్ పరిధిలో విషాదం నెలకొంది.. సీమా నాయక్ ఇటీవల బదిలీపై దమ్మపేట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారని ఆయనకు పేరుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలుమార్లు ఆయన ఉత్తమ ఉద్యోగి పురస్కారాలు పొందారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకపోయినప్పటికీ.. సీమా నాయక్ మృతి చెందిన పట్ల పోలీసులు విచార వ్యక్తం చేస్తున్నారు..

సీమా నాయక్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. హుటాహుటిన ఖమ్మం వెళ్లి.. సీమా నాయక్ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైరా ఎమ్మెల్యే బానోతు రాందాస్ నాయక్, ఇతర ఎమ్మెల్యేలు సీమా నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ ద్వారా సీమా నాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.