Pune Porsche Accident: పూణేలో ఆదివారం అర్థరాత్రి జరిగిన కారు (పోర్షే) యాక్సిడెంట్ లో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృతి చెంది 15 గంటల తర్వాత ప్రమాదానికి కారణమైన మైనర్ 17 ఏళ్ల యువకుడు బెయిల్ ఆర్డర్ తో ఇంట్లోనే ఉన్నాడు. మూడు రోజుల తర్వాత అతను చైల్డ్ అబ్జర్వేషన్ హోమ్ లో కనిపించాడు. అతన్ని కోర్టు మేజర్ గా విచారిస్తుందా? లేదంటే అతని తండ్రిని జైలులో విచారిస్తారా? అనే దానిపై నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
గంటకు 240 కిలో మీటర్ల వేగంతో వెళ్లే హైఎండ్ కారును నడపడం, దీనికి ముందు మద్యం తాగడంతో సదరు యువకుడికి జువెనైల్ జస్టిస్ బోర్డు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ‘రోడ్డు ప్రమాదం, వాటి పరిష్కారం’ అనే అంశంపై 300 పదాల వ్యాసం రాయడం, 15 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలను అధ్యయనం చేయడం, మద్యం అలవాటు, మానసిక చికిత్సకు కౌన్సిలింగ్ కు హాజరు కావడం వంటి షరతులు విధించింది.
ఇద్దరి మరణానికి కారకుడైన ప్రముఖ రియల్ వ్యాపారి కొడుకును తేలికగా విడిచిపెట్టారని అతని బెయిల్, షరతుల వార్తలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. వీటిపై పోలీసులు స్పందిస్తూ నిందితుడిని మేజర్ గా విచారించేందుకు అనుమతి ఇవ్వాలని జువైనల్ బోర్డును కోరామని, కానీ అది నిరాకరించిందని పుణె పోలీసులు తెలిపారు.
అయినా ఆగ్రహా వేశాలు కొనసాగుతుండడంతో పోలీసులు సోమవారం (మే 20) యువకుడి తండ్రిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. యువకుడికి, అతని ఇద్దరు స్నేహితులకు మద్యం సరఫరా చేసిన 2 బార్ల యజమానులు, సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశారు.
పుణె పోలీసుల రివ్యూ పిటిషన్ పై స్పందించిన జువెనైల్ జస్టిస్ బోర్డు టీనేజ్ నిందితులకు నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా బోర్డు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించి నిందితులను జూన్ 5 వరకు అబ్జర్వేషన్ హోంకు పంపించింది. తనను వయోజనుడిగా విచారించేందుకు అనుమతివ్వాలన్న పోలీసుల అభ్యర్థనపై బోర్డు ప్రతివాది నుంచి సమాధానం కోరింది.
పుణె సీపీ అమితేష్ కుమార్ ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ.. తాము ఆదివారం కోర్టుకు రెండు దరఖాస్తులు సమర్పించామని చెప్పారు. ఒకటి ఇది హేయమైన నేరమని, నిందితుడిని వయోజనుడిగా విచారించాలని, రెండోది దీనిపై న్యాయస్థానం నిర్ణయం తెలిపే వరకు నిందితుడిని మా అబ్జర్వేషన్ హోమ్ లో ఉంచాలని దరఖాస్తు వేసినట్లు తెలిపారు. అయితే ఆ రోజు న్యాయస్థానం ఈ దరఖాస్తులను అనుమతించలేదు. అందుకే సమీక్ష కోరామని, ఈ రోజు రెండు అంశాల్లోనూ అనుకూల ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు.
‘నిందితుడి రక్తపరీక్ష రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని, అవి అంత ముఖ్యమైనవి కావని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసు మద్యం మత్తులో పొరపాటు జరిగి ఇద్దరు మరణించిన ప్రమాదం గురించి కాదు. తన ప్రవర్తన గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉందనేదే మా వాదన.. అతను రెండు బార్లలో పార్టీలు చేసుకుంటాడు, ఇరుకైన, రద్దీగా ఉండే వీధిలో నెంబర్ ప్లేట్ లేని కారును వేగంగా నడుపుతాడు. అతను పూర్తిగా స్పృహలో ఉన్నాడు. తన చర్యల వల్ల ప్రజలు చనిపోతారని అతనికి తెలుసు. ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మీడియా దుష్ప్రచారం తర్వాత ఇది మా వైఖరి కాదు, ఆదివారం నుంచి మా వైఖరి ఇదే.’ అని సీపీ తెలిపారు.
నిందితుడిని మేజర్ గా విచారించాలన్న పోలీసుల అభ్యర్థనపై రేపటిలోగా స్పందించాలని నిందితుడి తరఫు న్యాయవాదిని కోరినట్లు కుమార్ తెలిపారు. అతడిని మేజర్ గా విచారించేందుకు అనుమతి లభిస్తుందని భావిస్తున్నామని చెప్పారు.
జూన్ 5వ తేదీ వరకు యువకుడు పునరావాస గృహంలో ఉంటాడని నిందితుడి తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ మీడియాకు తెలిపారు. ఈ సమయంలో ఆయనకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఇతర చర్యలు తీసుకుంటామని తెలిపారు.