https://oktelugu.com/

Mancherial: సెల్ ఫోన్ కు ఉన్న విలువలేదా నీ జీవితానికి.. ఎందుకింత పనిచేశావ్ తల్లీ!?

మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం వేలాల గ్రామానికి చెందిన స్వామి–సారక్క దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. ఒక్కగానొక్క కూతురు సాయి సుమ(19)ను గారాబంగా పెంచారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 12, 2024 / 12:52 PM IST

    Mancherial

    Follow us on

    Mancherial: కష్టాలు, సుఖాలు, సంతోషాలతో సాగేదే జీవితం. ఇందులో దుఃఖం, బాధ, నష్టాలు, గాయాలు, ఎదురు దెబ్బలు ఇలా అనేకం ఉంటాయి. వాటిని దాటుకుని సాగితేనే లక్ష్యాన్ని చేరుకుంటాం. విజయం సాధిస్తాం. అదే జీవితం. కానీ నేటితరం చిన్న సమస్య వచ్చినా ఎదుర్కొనలేకపోతోంది. చిన్న చిన్న సమస్యలు, కారణాలకే జీవితానికి ముగింపు పలుకుతోంది. ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. క్షణికావేశంలో పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు తీరని శోఖాన్ని మిగులుస్తున్నాయి. ఓ యువతి కూడా చిన్నపాటి విషయంలో తీసుకున్న నిర్ణయం ఆమె తల్లిదండ్రులకు జీవితాంతం కన్నీళ్లే మిగిల్చింది.

    సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేయించలేదని..
    మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం వేలాల గ్రామానికి చెందిన స్వామి–సారక్క దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. ఒక్కగానొక్క కూతురు సాయి సుమ(19)ను గారాబంగా పెంచారు. ప్రస్తుతం డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. ఇటీవల వాళ్ల ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్‌ పాడైంది. దానిని రిపేర్‌ చేయించాలని అన్నయ్యలను, తల్లిదండ్రులను కోరింది సాయిసుమ. డబ్బులు లేవనో, టైం దొరకడం లేదనో వారు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా పదేపదే పాడు చేస్తున్నావని సాయిసుమను మందలించారు. కొన్ని రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పారు.

    క్షణికావేశంలో..
    తల్లిదండ్రుల మాటలకు నొచ్చుకున్న సాయిసుమ.. తీవ్ర మనస్థాపం చెందింది. అన్నలు ఏదడిగినా వెంటనే ఇస్తాను.. నేను అడిగితే మాత్రం ఇవ్వరు అని బాధపడింది. క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో ఉరేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చి దారుణం చూసి గుండెలు పగిలేలా రోదించారు.

    మొబైల్‌ కన్నా జీవితం ఎక్కువ ఖరీదు కదా..
    డిగ్రీ చదువుతున్న సాయిసుమ సెల్‌ఫోన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం తన జీవితానికి ఇవ్వలేకపోయింది. డిగ్రీ వయసులో విచక్షణతో ఆలోచించలేకపోయింది. తన జీవితం సెల్‌ఫోన్‌ పాటి విలువ కూడా చేయదు అన్నట్లు.. సెల్‌ఫోన్‌ లేకుంటే జీవితమే లేదన్నట్లు.. కఠిన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. ఎందుకు తల్లీ.. జీవతమే సెల్‌ఫోన్‌ కన్నా ఖరీదైందని గుర్తించలేకపోయావ్‌.. ఆ తల్లిదండ్రులు ఎవరు ఓదార్చాలి.. ఎలా ఓదార్చాలి.. నీదారిన నువ్వు వెళ్లిపేతో.. కన్నపేగు ఎంత తల్లడిల్లుతుందో తెలుసా?