Crime News : తప్పుడు లైంగికదాడి కేసు పెట్టిన మహిళకు నాలుగేళ్ల జైలు! రూ.5.90 లక్షల ఫైన్

నిర్దోషి నాలుగేళ్లు జైల్లో ఉండేలా చేసినందుకు బాలిక తల్లి కూడా అదే శిక్ష అనుభవించేలా ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. మహిళను కూడా జైల్లో అన్ని రోజులు ఉంచాలని జడ్జి జ్ఞానేంద్ర త్రిపాఠి ఆదేశించారు.

Written By: NARESH, Updated On : May 6, 2024 11:07 am

A woman who filed a false rape case was jailed for four years!

Follow us on

Crime News : తన కుమార్తెపై లైంగికదాడి చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసుతో ఓ యువకుడు నాలుగేళ్లు జైలులో గడిపాడు. కానీ, చివరక అసలు నిజం బయటపడింది. దీంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చాడు. తప్పుడు కేసు పెట్టిన మహిళకు యువకుడు అనుభవించిన విధంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన జరిగింది.

ఏం జరిగిందంటే..
బరేలీలోని బరాదరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ మహిళ తన కుమార్తెపై అత్యాచారం జరిగిందంటూ 2019, డిసెంబర్‌ 2న పోలీసులకు ఫిర్యాదుచేసింది. తన 15 ఏళ్ల కూతురును అజయ్‌ అలియాస్‌ రాఘవ్‌ ఢిల్లీకి తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చి లైంగికదాడి చేశాడనిపేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను న్యాయస్థానంలో హాజరు పరిచారు. అజయ్‌ తనపై లైంగికదాడి చేశాడని బాలిక తొలుత వాంగ్మూలం ఇచ్చింది. దీంతో కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది. దీంతో నిందితుడు నాలుగేళ్లు జైల్లోనే ఉన్నాడు.

నిజం చేప్పిన బాలిక…
తాజాగా విచారణ సందర్భంగా కోర్టుకు వచ్చిన బాలిక అసలు విషయం చెప్పింది. తన వాంగ్మూలం తప్పని న్యాయమూర్తి ఎదుట అంగీకరించింది. దీంతో అదనపు సెషన్స్‌ న్యాయస్థానం అజయ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. తప్పుడు కేసు పెట్టినందుకు బాలిక తల్లిపై 340 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

నాలుగేళ్ల జైలు..
నిర్దోషి నాలుగేళ్లు జైల్లో ఉండేలా చేసినందుకు బాలిక తల్లి కూడా అదే శిక్ష అనుభవించేలా ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. మహిళను కూడా జైల్లో అన్ని రోజులు ఉంచాలని జడ్జి జ్ఞానేంద్ర త్రిపాఠి ఆదేశించారు. అంతేకాకుండా రూ.5,88,822 జరిమానా కూడా విధించారు. ఈ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు.