Kesamudram Crime News: అతడి పేరు వీరన్న. ఉండేది ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం మండలం బోర మంచా తండ. వీరన్న కు భార్య విజయ ఉన్నది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. వీరన్న కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇదే సమయంలో ఇల్లు కట్టాలని భార్య అతని మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఏం చేయాలో తెలియక వీరన్న నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
విజయకు బాలాజీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బాలాజీ సహాయంతో ఆమె ముత్తూట్ ఫైనాన్స్ లో హౌసింగ్ లోన్ తీసుకుంది. అయితే ఈ రుణం చెల్లించే క్రమంలో విజయ ఇబ్బంది పడుతోంది. ఎలాగైనా సరే ఆ హౌసింగ్ లోన్ క్లియర్ చేయాలని విజయ భావించింది. ఇదే విషయాన్ని ప్రియుడు బాలాజీ తో చెబితే.. అతడు ఒక ప్రణాళిక రూపొందించాడు. వీరన్న చనిపోతే.. అతని పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ కింద డబ్బులు వస్తాయని చెప్పాడు. దానికి విజయ ఓకే చెప్పింది. ఇదే క్రమంలో వీరన్న కు బాలాజీ దగ్గర అయ్యాడు. రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం వీరన్న ఒకరోజు పామాయిల్ తోటకు రప్పించుకున్నాడు.
పామాయిల్ తోట వద్దకు వెళ్లిన వీరన్న కు బాలాజీ పీకలదాకా మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న వీరన్న పై బాలాజీ, ఆర్ఎంపీ డాక్టర్ భరత్ దాడి చేశారు. ఇనుప రాడ్ తో కొట్టడంతో వీరన్న చనిపోయాడు. ఇదే విషయాన్ని విజయకు బాలాజీ ఫోన్ ద్వారా తెలియజేశాడు. దీంతో వీరన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించాలని విజయ చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే ఆర్ఎంపీ డాక్టర్ భరత్, బాలాజీ వీరన్న మృతదేహాన్ని రోడ్డుమీద తీసుకువచ్చారు. ఒక వాహనంతో ఢీ కొట్టించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించారు.
వీరన్న చనిపోయిన విషయం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వీరన్న తల మీద కాకుండా మెడ మీద కూడా తీవ్రంగా గాయాలు కావడం.. అంతర్గత అవయవాలు కూడా దెబ్బలు తగిలినట్టు గుర్తించడంతో పోలీసులకు అనుమానం కలిగింది.. వెంటనే విజయ ఫోన్ నెంబర్ లో కాల్ డాటా పరిశీలించారు. అందులో విజయ, బాలాజీ తరచుగా మాట్లాడుకున్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు వారిదైన శైలిలో విచారించారు. ఫలితంగా విజయ, బాలాజీ తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.
ఈ ఘటన జరిగిన కేవలం 24 గంటల్లోనే పోలీసులు అసలు నిందితులను పట్టుకున్నారు. బంధువుల ముందు తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా విజయ తీవ్రంగా విలపించింది.. చివరికి పోలీసుల విచారణలో ఈ ఘటనకు ఆమె సూత్రధారి అని తెలియడంతో బంధువులు ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అటు తండ్రి చనిపోవడం.. ఇటు తల్లి జైలుకు వెళ్లడంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.