Vizianagaram: మానవ మృగాల అకృత్యాలు ఆగడం లేదు.’నిర్భయ’ల భయం వీడలేదు. ‘దిశ’ల దశ మారలేదు.’హత్రాస్’ హాహాకారాలు ఆగలేదు. ‘భాద్రాస్’ బాలిక ఆత్మఘోష ఆరనేలేదు.’ఉన్నావ్ ‘ చిన్నారి గొంతు ఆగిపోయింది.. ఇలా అత్యాచార ఆక్రందనలు, మదపుటేనుగల మానభంగాలు.. దుర్మార్గం లాంటి దుర్ఘటనల జాబితాకు అంతం లేకుండా పోతోంది. తాజాగా విజయనగరం జిల్లాలో అమానుష ఘటన ఒకటి బయటకు వచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా జుగుప్సాకరంగా ఉంది.
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో ఓ గ్రామంలో చోటు చేసుకున్న ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఓ గ్రామంలో 6 నెలల చిన్నారిని తల్లి ఊయలలో పడుకోబెట్టింది. సామాన్లు తెచ్చుకునేందుకు కిరాణా దుకాణానికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వృద్ధుడు ప్రవేశించాడు. ఊయలలో ఉన్న చిన్నారిని బయటకు తీసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడుపు విని చిన్నారి అక్క తల్లికి సమాచారం ఇచ్చింది. తల్లితోపాటు గ్రామస్తులు నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించారు. కానీ ఆ వృద్ధుడు పరారయ్యాడు. వెంటనే చిన్నారిని బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయనగరంలోని ఘోష ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.జిల్లాలో ఈ ఘటన సంచలనం గా మారింది.
దేశవ్యాప్తంగా ఎన్ని రకాల చట్టాలు తెచ్చినా.. కఠిన చర్యలకు ఉపక్రమించినా.. మహిళలపై అకృత్యాలు నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలపై మానవ మృగాల అత్యాచారాలు నిరాటంకంగా, నిర్భయంగా, నిస్సిగ్గుగా జరుగుతూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం రోజుకు సగటున 87 కేసులు, నిమిషానికి 16 రేప్ లు, 30 గంటలకు ఒక సామూహిక అత్యాచార హత్య, గంటకు ఒక వరకట్న చావు జరుగుతుందని తేలడం ఆందోళన కలిగిస్తోంది.
మైనర్ బాలికలను కూడా వదలని కీచకులు.. తమ కామ వాంఛతో రెచ్చిపోతున్నారు. అరణ్యాల్లో సంచరించాల్సిన మగ మృగాలు ఆవాసాల్లో అకృత్యాలకు పాల్పడుతున్నారు. పాశవిక ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మహిళల అభద్రతకు అడ్డంపట్టే ఇలాంటి దారుణ దుష్ట చేష్టలకు చరమగీతం వాడాల్సిందే. ఒంటరి మహిళకు రక్షక గొడుగు పట్టాలి. మహిళలను మర్యాదగా చూస్తూ చిన్నారులకు ప్రేమలు పంచాలి. చట్టం అంటే చావు కనిపించాలి. అత్యాచారం అంటే ఆఖరు ఘడియలు గుర్తుకు రావాలి. నరరూప రాక్షసుల భారతం పట్టాలి. ఉరి కంభం ఎక్కించాలి. అప్పుడే ఈ దేశంలో మహిళలకు రక్షణ ఉంటుంది.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినామహిళలపై దాడులు,ఆకృత్యాలు ఆగడం లేదు. మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. తామూ ఓ తల్లి కే పుట్టామని.. తమకు అక్క చెల్లెలు ఉంటారని మరిచి అకృత్యాలకు పాల్పడుతున్నారు కొందరు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడపిల్లలు కనిపిస్తే చాలు దారుణాలకు ఒడిగడుతున్నారు. మరికొందరైతే వావి వరుసలు మరిచి కుటుంబం, బంధువుల్లోని అబలలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించకపోతే మాత్రం సభ్య సమాజంలో ఆడది బతకడం కష్టంగా మారుతుంది. ఆటవిక రాజ్యంగా మిగులుతుంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలా రకాల ఘటనలు జరిగాయి. అప్పట్లో విపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఎల్లో మీడియా సైతం పతాక శీర్షికన కథనాలు రాసింది. ఇప్పుడు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటువంటి ఘటనలకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం ప్రజల్లో పలుచన కావడం ఖాయం.