West Godavari: తాళం( key )వేసిన ఇంటి వద్దకు చేరుతారు ఆ ఇద్దరు. బావగారు లేరండి? అన్నయ్యగారు లేరా? అక్క ఎక్కడికి వెళ్ళింది? అని ఇరుగుపొరుగు వారికి కుశల ప్రశ్నలు వేస్తారు. తాళం వేసిన ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యుల గురించి ఆరా తీస్తారు. వారు ఎక్కడికి వెళ్ళింది.. ఎప్పుడు వస్తారో తెలుసుకుంటారు.. రాత్రికి వచ్చి ఆ ఇంటిని గుల్ల చేస్తారు. దొంగతనంలో ఇదో స్టైల్. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ ఇద్దరు కేటుగాళ్లు ఇలా సరికొత్త దొంగతనాలు చేస్తూ పోలీసులకు గత కొద్దిరోజులుగా సవాల్ విసురుతూ వచ్చారు. చివరకు ఓ దొంగతనం కేసులో పట్టుపడ్డారు. దీంతో వారి చాకచక్యం బయటపడింది.
* పోలీస్ దర్యాప్తులో అలా..
భీమవరం ( Bhimavaram) వెంటే వారి తోటలో నివాసం ఉంటున్న ఆంజనేయ స్వామి ఇటీవల ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులకు బంధువుల ఇంటికి వెళ్లారు. తణుకు ఇందిరమ్మ కాలనీకి చెందిన నగరపు ఈశ్వరరావు, పాతూరుకు చెందిన తండాసి కామేశ్వరరావు బృందంగా ఏర్పడ్డారు. ఇద్దరూ వెళ్లి ఆంజనేయ స్వామి ఇంటి వద్ద ఆరా తీశారు. చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించారు. పగటిపూట ఆ వివరాలను తెలుసుకొని రాత్రి దొంగతనానికి దిగారు. ఇంట్లో ఉన్న లక్ష రూపాయలకు పైగా విలువ చేసి బంగారాన్ని దోచుకుపోయారు. అయితే ఇంటికి వచ్చిన ఆంజనేయ స్వామి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తునకు బృందాలు రంగంలోకి దిగాయి.
* ఇద్దరూ పాత నేరస్తులు..
అయితే ఈశ్వరరావు( eshwar Rao) తో పాటు కామేశ్వరరావు పాత నేరస్తులు. వారి కదలికలను గమనించిన పోలీసులు భీమవరంలో వారిని పట్టుకున్నారు. వారిని ఆరా తీయగా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో 1,80,000 విలువ చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తేలింది. ఆంజనేయ స్వామి ఇంట్లో కూడా తామే దొంగతనం చేసినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
* బంధుత్వంతో పిలిచి..
అయితే వీరిద్దరూ దొంగతనం( thefting ) చేసే స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను చూసుకుంటారు. ఆ ఇరుగుపొరుగు వారిని సంప్రదిస్తారు. బావ, అన్నయ్య, అక్క, చెల్లి అంటూ సంబోధిస్తారు. వారు ఎప్పుడొస్తారండి అంటూ ఏదో బంధుత్వం ఉన్నట్టు నటిస్తారు. వాళ్లు ఊళ్లో లేరని తెలియగానే రాత్రికి ఇళ్లల్లో చొరబడి దొంగతనాలకు పాల్పడతారు. ఉభయగోదావరి జిల్లాల్లో వీరిద్దరూ చాలా దొంగతనాలు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.