Mango Theft Case: ఇప్పుడంటే వందల కోట్లు దొంగతనం చేసిన పెద్దగా శిక్షలు పడటం లేదు. పైగా నేరస్తులు దర్జాగా దేశం దాటి వెళుతున్నారు. రకరకాల మార్గాలలో అక్రమంగా సంపాదిస్తున్నారు. సమాజంలో పెద్ద వ్యక్తులుగా చలామణి అవుతున్నారు. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. అప్పట్లో చట్టం, ధర్మం, న్యాయం అనేవి నాలుగు పాదాల మీద నడిచేవి. అందుకే తప్పు చేయాలంటే వణుకు పుట్టేది. ఎదుటివారిని మోసం చేయాలంటే భయం వేసేది. జనాలలో మానవత్వం ఉండేది. అయితే ఆ రోజుల్లో జరిగిన ఒక దొంగతనం సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ కేసుకు సంబంధించి ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు కూడా చర్చకు కారణమైంది.
మహారాష్ట్రలోని థానే అనే ప్రాంతంలో 1924 జూలై నెలలో కొంతమంది వ్యక్తులు 185 ఆకుపచ్చ మామిడి పండ్లను దొంగతనం చేశారు. అప్పట్లో ఆకుపచ్చ మామిడి పండ్లు మహారాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్. పైగా ఆ మామిడి పండ్లను బ్రిటిష్ వారు ఇష్టంగా తినేవారు. అయితే ఈ మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించి అప్పట్లో కేసు నమోదయింది.. ఈ తోట బోస్టయివ్ ఎల్లిస్ ఆండ్రాడెన్ కు చెందింది. ఆ తోట ఆ సంవత్సరం విరగ కాయడంతో నిందితులు అందులో ఉన్న పండ్లను దొంగతనం చేశారు. అలా వారు దొంగిలించిన మామిడి పండ్లను స్థానిక మార్కెట్లో ఒక డీలర్ కు విక్రయించారు. అలా వారు విక్రయిస్తుండగా కొంతమంది చూశారు. అయితే ఈ కేసు కోర్టు పరిధిలోకి వెళ్ళింది. మామిడి పండ్లను దొంగతనం చేసిన నిందితులపై ఐపిసి 379/109 కింద అభియోగాలు మోపారు.
ఈ కేసును విచారించిన అప్పటి న్యాయమూర్తి టీఏ ఫెర్నాండేజ్ జూలై 5, 1924 న తీర్పు వెలువరించారు. నిందితుల వయసును పరిగణలోకి తీసుకొని మందలించి వదిలిపెట్టారు..” యువకులకు శిక్ష విధించి వారి జీవితాన్ని నాశనం చేయాలని నేను భావించడం లేదని” న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే 100 సంవత్సరాల క్రితం నాటి ఈ తీర్పు కాపీ ఇటీవల బయటికి వచ్చింది.. పూణే ప్రాంతంలో ఉండే మహిమాకర్ అనే న్యాయవాది.. ఇటీవల ఇల్లు మారారు. ఇలా ఇల్లు మారుతున్న క్రమంలో తన పాత ఇంటి అటకపై చాలా రోజులుగా పడి ఉన్న ఒక సంచి అతనికి కనిపించింది. దానిని తెరిచి చూస్తే కొన్ని స్థిరాస్తి పత్రాలు కనిపించాయి. అందులో పచ్చ మామిడిపండ్ల కేసుకు సంబంధించిన తీర్పు కాపీ కూడా ఉంది.. ఆయన ఈ విషయాన్ని బయట పెట్టడంతో.. వందేళ్ల క్రితం నాటి కేసు, న్యాయమూర్తి విధించిన తీర్పు బయటకు వచ్చింది.. ఇప్పుడది సంచలనంగా మారింది.