Shocking Incident: ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ ప్రమాదం ధాటికి మూడు ఇళ్లల్లో మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో నష్టం తీవ్రత అధికంగా ఉంది.. ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో నష్టం ఎక్కువగా జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన మల్లయ్య, కృష్ణమూర్తి కి చెందిన 25 లక్షల నగదు కాలిపోయింది. అపు పత్రాలు, బియ్యం బస్తాలు కళ్ళ ముందు మంటలకు ఆహుతయ్యాయి. ఐలయ్య అనే వ్యక్తి చెందిన ఐదు లక్షల విలువైన టెంట్ సామగ్రి మంటల్లో కాలిపోయింది.. ఈ ప్రమాదం వల్ల దాదాపు 30 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ” తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఏదో గ్రానైట్ క్వారీలో పెడుతున్నారని అనుకున్నాం. కానీ మా చుట్టూ పక్కల ప్రాంతంలో ఎలాంటి గ్రానైట్ క్వారీలు లేవు. కానీ మా ఊర్లోనే అలాంటి పేలుడు జరగడంతో ఏం జరిగిందోనని బయటికి వచ్చాం. వచ్చి చూడగా మంటలు వస్తున్నాయి. చూస్తుండగానే మూడు ఇళ్లల్లో మంటలు అదేపనిగా మండుతూనే ఉన్నాయి. ఫైర్ ఇంజన్ వచ్చేలోపు మంటలు విపరీతంగా అలముకోవడంతో దారుణంగా నష్టం చోటుచేసుకుందని” గ్రామస్తులు అంటున్నారు.
అందువల్లే ఇలా..
ముందుగా కృష్ణమూర్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో కృష్ణమూర్తికి చెందిన నగదు కాలిపోయింది. ఆ మంటలు మల్లయ్య ఇంటికి కూడా వ్యాపించాయి. మల్లయ్య నగదు, ఇతర వస్తువులు కాలిపోయాయి.. మల్లయ్య అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు పూర్తిగా కాలిపోయాయి.. ఐలయ్యకు చెందిన ఐదు లక్షల విలువైన టెంట్ సామగ్రి కాలిపోయింది. ఈ స్థాయిలో నష్టం జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇళ్ళు పక్క పక్కనే ఉండడం.. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి మంటలు భారీగా వ్యాపించడంతో ఒక్కసారిగా గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో గ్రామస్తులు సంఘటన స్థలానికి వచ్చారు. కానీ అప్పటికే దారుణం జరిగిపోయింది. చూస్తుండగానే 25 లక్షల నగదు కళ్ళ ముందు కాలిపోవడంతో బాధితుల ఆవేదనకు అంత అనేది లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి నష్ట తీవ్రతను నమోదు చేసుకుని వెళ్లారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.. మరోవైపు బాధితులకు పలు స్వచ్ఛంద సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి. గ్రామస్తులు కూడా అండగా నిలుస్తున్నారు. బియ్యం, నిత్యవసరాలు, ఇతర వస్తువులు వితరణగా అందించి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.