Nizamabad: కొడుకు చేసిన పనికి తలవంపులు.. తట్టుకోలేక కుటుంబం మొత్తం బలవన్మరణం

"కష్టపడింది ఏదీ రాదు. కష్టపడకుండా సంపాదించింది ఎప్పటికీ నిలవదు" నరసింహ సినిమాలో రజనీకాంత్ చెప్పే డైలాగ్ ఇది. అప్పటి పరిస్థితులకే కాదు, ఎప్పటి పరిస్థితుల కైనా ఈ డైలాగ్ వర్తిస్తుంది.. ఏదైనా సాధించాలంటే కష్టపడాలి. అది దక్కేదాకా చెమటలు చిందించాలి. ఆ తర్వాత అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. స్థిరంగా నిలిచి ఉంటుంది. కానీ ఈ ప్రాథమిక సూత్రాన్ని నేటితరం విస్మరిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 6, 2024 10:19 am

Nizamabad

Follow us on

Nizamabad: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. అయితే ఈ మోసాల బారిన పడి యువత సర్వనాశనం అవుతోంది. ముఖ్యంగా ఆన్ లైన్ బెట్టింగ్ లాంటి వ్యవహారాలకు యువత సులువుగా ఆకర్షితులవుతోంది. భారీగా సంపాదించాలి అనే అత్యాశతో ఉన్నది మొత్తం పోగొట్టుకుంటున్నది.. అలాంటి సంఘటన ఉమ్మడి నిజాంబాద్ జిల్లా వడ్డేపల్లిలో చోటుచేసుకుంది. నిజాంబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగణవేణి సురేష్(55), హేమలత (48) దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. మెదడు వాపు వ్యాధి వల్ల కూతురు చిన్నతనంలో ఉన్న చనిపోయింది. ఉన్న ఒక్క గానొక్క కుమారుడు హరీష్ (22) ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు.. ఆరు నెలల క్రితం నుంచి పని మానేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. సురేష్ దంపతులకు చిన్న కిరాణా షాపు ఉంది. దాన్ని నడిపిస్తూనే.. వ్యవసాయ పనులకు కూలీలుగా వెళ్తూ.. సంసారాన్ని సాగిస్తున్నారు. రూపాయి రూపాయి వెనకేయగా.. కొంత మొత్తంలో నగదు సమకూరింది. దీంతో ఆ డబ్బుతో ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణం కూడా మొదలుపెట్టారు. ఇదే సమయంలో కుమారుడు హరీష్ ఆన్ లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. భారీగా అప్పులు తీసుకొచ్చాడు. అవి తీర్చే మార్గం లేకపోవడంతో.. అప్పులు ఇచ్చిన ఇచ్చిన వాళ్ళ దగ్గర తలవంచాడు. దీంతో వారు ఇంటి మీద పడ్డారు. కొడుకు చేసిన అప్పులను తీర్చడానికి సురేష్ దంపతులు ఏకంగా ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారు. హరీష్ చేసిన 30 లక్షల అప్పులను.. తమకు ఉన్న 20 గుంటల పొలాన్ని అమ్మి తీర్చేశారు.

కుమారుడిలో మార్పు రాలేదు..

30 లక్షల అప్పు తీర్చినప్పటికీ హరీష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా అతడు అదేవిధంగా బెట్టింగ్ కొనసాగిస్తున్నాడు.. దీంతో మనస్థాపం చెందిన సురేష్, హేమలత దంపతులు, కుమారుడు హరీష్ శుక్రవారం రాత్రి ఉరి వేసుకున్నారు. ఆ ఇంట్లో నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వారు తలుపులు కొట్టారు. ఆయనప్పటికీ స్పందన లేకపోవడంతో.. ఇంటి వెనకనుంచి చూశారు. ముగ్గురు కూడా ఉరివేసుకొని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి హరీష్ అనేక వ్యసనాలకు బానిసగా మారాడు. గత ఆరు నెలల నుంచి పెట్రోల్ బంక్ లో పనిచేయకుండా ఇంటి వద్ద ఉంటున్నాడు. చదువు అబ్బకపోవడంతో హరీష్ జులాయిగా తిరిగేవాడు. చివరికి వ్యసనాలకు అలవాటు పడి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. చివరికి తన తల్లిదండ్రుల బలవన్మరణానికి కారణమయ్యాడు.