BJP: బిజెపి కి డేంజర్ బెల్స్.. ఆ రెండు రాష్ట్రాలు ‘హస్త’గతం తప్పదా?

సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ. కానీ అతి కష్టం మీద, మిత్రుల సహకారంతో గట్టెక్కింది. అయితే ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో బిజెపి అధికారానికి దూరం కావడం ఖాయమని తేలుతోంది.

Written By: Dharma, Updated On : October 6, 2024 10:41 am

BJP Party

Follow us on

BJP: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయా?బిజెపికి క్రమేపి ఆదరణ తగ్గుతోందా? 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకుంటుందా?కేంద్రంలో అధికారానికి చేరువ అవుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా జరిగిన హర్యానా, కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. దీంతో గతంలో చేజారిన రాష్ట్రాలు ఒక్కొక్కటి హస్తగతం అవుతున్నాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. 2019 ఎన్నికల నాటికి మరింత పతనమైంది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. భవిష్యత్తుపై ఆశలను సజీవంగా నిలుపుకుంది. మొన్నటి ఎన్నికల్లో బిజెపికి ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. ఒంటరిగా 370 సీట్లు.. ఎన్డీఏ కూటమిపరంగా 400 సీట్లు తగ్గించుకుంటామని కాషాయ దళం ధీమా వ్యక్తం చేసింది. కానీ బిజెపి బలం 240 సీట్లతో నిలిచిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ సైతం సెంచరీకి చేరువయ్యింది. ఇప్పుడు వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు తాజాగా జరుగుతున్న రెండు రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఉంటుందని తేలడం విశేషం.

* అప్పట్లో కాంగ్రెస్ హవా
1999 ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. వాజపేయి నేతృత్వంలోని కూటమి ఐదేళ్లపాటు అధికారాన్ని కొనసాగించింది.అయితే 2004 ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2009లో సైతం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది.కానీ 2014 ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయింది యూపీఏ కూటమి. అక్కడి నుంచి గత పదేళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది కానీ.. అధికారంలోకి రాలేకపోతోంది.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న రాష్ట్రాలు సైతం.. బిజెపి ఖాతాలో పడుతూ వస్తున్నాయి.

* మెజారిటీకి ఆమడ దూరంలో
అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బిజెపి అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాలేదు. కీలకమైన రాష్ట్రాల్లో ఆ పార్టీకి కనీస స్థాయిలో కూడా సీట్లు రాలేదు.దీంతో మిత్రుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. హర్యానాలో వరుసగా బిజెపి అధికారంలో ఉండడంతో ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ లో తేలాయి. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తేల్చి చెబుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో సైతం కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే బిజెపికి డేంజర్ బెల్స్ మోగినట్టే. ఇదే ఊపు కొనసాగితే 2029 ఎన్నికల నాటికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి చేరువ కావడం ఖాయమని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.