Guntur District: అవసరానికి అప్పు తీసుకోవడంలో తప్పులేదు. తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించడమే అసలైన పద్ధతి. కాకపోతే నేటి కాలంలో అప్పు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ తీర్చడంలో ఉండడం లేదు. ఫలితంగా అప్పు పుట్టడమే గగనం అయిపోయింది. అన్నింటికీ మించి అప్పు ఇచ్చినవాడు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. అందువల్లే అప్పు ఇస్తే తిరిగి రాదు అని నమ్మకం చాలా మందిలో పెరిగిపోతోంది. ఫలితంగా ఆపత్కాలంలో అవసరమైన వారికి డబ్బు పుట్టడం లేదు. కొన్ని సందర్భాలలో అప్పులు దారుణాలకు దారి తీస్తున్నాయి.. ఏపీ రాష్ట్రంలో అప్పు కారణంగా ఇద్దరు వ్యక్తులు కన్నుమూశారు. మరో ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం అనే గ్రామంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం 50వేలను అప్పుగా ఇచ్చాడు. అయితే ఎన్ని రోజులు గడిచినప్పటికీ శ్రీనివాసరావు కు వెంకటేశ్వర్లు డబ్బులు చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీనివాసరావు ఎదురైనప్పుడల్లా వెంకటేశ్వర్లు దూరంగా వెళ్తున్నాడు. డబ్బుల గురించి మాట్లాడుతుంటే ముఖం చాటేస్తున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో వెంకటేశ్వర్లు మీద శ్రీనివాసరావు ఆగ్రహాన్ని పెంచుకున్నాడు. ఇటీవల వెంకటేశ్వర్లు ఇంటికి తన భార్య పూర్ణ కుమారి, కుమారుడు వెంకటేష్ తో కలిసి వెంకటేశ్వర్లు ఇంటికి శ్రీనివాసరావు వెళ్ళాడు. తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించాలని డిమాండ్ చేస్తే.. దీంతో వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వెంకటేశ్వర్ల ప్రాణానికి ముప్పు ఉంటుందని భావించిన శ్రీనివాసరావు కూడా పురుగుల మందు తాగాడు.. ఈ పరిణామం పూర్ణ కుమారికి, వెంకటేష్ కు ఇబ్బందికరంగా మారింది. దీంతో వారిద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పూర్ణ కుమారి మృతదేహం లభించింది. వెంకటేష్ మృతదేహం కోసం గాలిస్తున్నారు.
శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసరావు దగ్గర తీసుకున్న డబ్బులను వెంకటేశ్వర్లు సకాలంలో చెల్లించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు. అవసరానికి శ్రీనివాసరావు దగ్గర డబ్బులు తీసుకున్న వెంకటేశ్వర్లు ఆ తర్వాత ముఖం చాటేయడం.. డబ్బులు అడిగితే పట్టించుకోకపోవడం వల్ల ఈ దారుణం జరిగింది.. ఈ ఘటన పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.