Delhi: ధ్రువ సినిమా చూశారా.. అందులో రామ్ చరణ్ శరీరంలో ఒక బగ్ ఉంటుంది. దాని ద్వారా అరవింద్ స్వామి రామ్ చరణ్ మాట్లాడిన మాటలు మొత్తం వింటూ ఉంటాడు. అతడు చేసే పనులకు కౌంటర్ ఇస్తూ ఉంటాడు. రామ్ చరణ్ ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అటువంటి బగ్ మన శరీరంలో ఒకటి ఉంటే.. అది కూడా ఒక ఫోన్ రూపంలో ఉంటే.. ఎలా ఉంటుంది.. చదువుతుంటే ఆందోళన కలుగుతుంది కదూ.. మనదేశంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్ నగరంలో ముగ్గురు సోదరీమణులు ఒకరి వెంట ఒకరు బలవంతంగా చనిపోయారు. దీని వెనుక భయంకరమైన కారణాలు ఉన్నాయి.
మనలో చాలామందికి కొరియన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. కొరియన్ డ్రామాలు బాగుంటాయి. కొరియన్ సినిమాలలో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. ప్రారంభం నుంచి చివరి వరకు కొరియన్ సినిమాల్లో డ్రామా.. ఉత్కంఠ.. ముని వేళ్ళ మీద నిలబెట్టే ఉద్వేగం ఇలా చాలా ఉంటాయి. అందువల్లే చాలామంది కొరియన్ సినిమాలను ఇష్టపడుతుంటారు.
ప్రపంచానికి భిన్నంగా.. ఆలోచించడం కొరియన్ ప్రజలకు ఇష్టం. టెక్నాలజీతో వారు ఒక ఆట ఆడుకుంటారు. అయితే ఇతరుల భావోద్వేగాలను తమ గుప్పెట్లోకి తీసుకోవడం చాలా మంది కొరియన్ ప్రజలకు అలవాటు. దాన్ని ఒక ఆనందంగా వారు భావిస్తుంటారు. ప్రపంచం మొత్తం తమ చేతిలో ఉంది అని అనుకుంటారు. అందువల్లే కొరియన్ నిపుణులు కొంతమంది గేమ్స్ రూపొందించారు. ఈ గేమ్స్ కు సంబంధించిన ఏ వ్యవహారం కూడా అధికారికంగా బయటికి కనిపించదు. తయారీదారులు కూడా వారి వివరాలు బయటపెట్టరు. రకరకాల మాధ్యమాలలో తమ గేమ్స్ గురించి ప్రమోషన్ చేసుకుంటారు. ముఖ్యంగా యుక్త వయసు పిల్లల్ని లక్ష్యంగా చేసుకొని ఏదో ఒక రూపంలో వారికి దగ్గరవుతారు.
“నువ్వు స్మార్ట్ గా ఆలోచిస్తున్నావ్. నీ కళ్ళల్లో స్పార్క్ కనిపిస్తోంది. మీ అమ్మానాన్న పెట్టిన పేర్లతోనే నువ్వు ఉంటావా.. ఈ కొరియన్ పేరు ట్రై చెయ్.. అసలు నువ్వు స్కూల్ కి ఎందుకు వెళ్లాలి.. ఈరోజు కాలేజీకి ఎందుకు బంక్ కొట్టకూడదు.. నువ్వు ఒంటరిగా ఉంటూ జీవితాన్ని ఎందుకు ఆస్వాదించకూడదు.. ఈ నాలుగు గోడల మధ్యలోనే నువ్వు స్వేచ్ఛను ఎందుకు కోరుకోకూడదు.. కొత్త కొత్త టాస్క్ లు చేసేయ్. నీకు ప్రతిదీ ఉద్వేగంగా ఉంటుంది. చదువుకుంటే మహా అయితే ఉద్యోగం మాత్రమే చేస్తావు. ఒక కింద బానిసలాగా పనిచేయడం నీకు అవసరమా” ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటారు.
టీనేజ్ పిల్లలలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో కొరియన్ గేమ్స్ నిర్వాహకులు యూత్ పిల్లలను రెచ్చగొడుతుంటారు. ఒకరకంగా వారిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ప్రతిరోజు ఒక టాస్క్ ఇస్తూ ఉంటారు. ఆ టాస్క్ పూర్తి చేసిన తర్వాత నువ్వు ప్రపంచంలోనే ధీరుడువి.. నీలాంటి శక్తివంతుడు ఎవరూ లేరు.. ఈ ప్రపంచంతో నీకే సంబంధం.. నీకై నువ్వు ఒంటరిగా వచ్చావు కదా.. ఒంటరిగా వెళ్తే తప్పేంటి అన్నట్టుగా యువతలో లేనిపోని ఉద్వేగాలను నూరిపోస్తుంటారు.
ఆ తర్వాత వారిని తమ ఆధీనంలోకి పూర్తిగా తీసుకున్న తర్వాత.. ఈ ప్రపంచం తో నీకు సంబంధం లేదు.. నువ్విక వెళ్ళిపోవచ్చు.. ఈ టాస్క్ లో కనుక నువ్వు చనిపోతే విజేతవు.. అంటూ ఒక రకమైన ఉద్వేగాన్ని రుద్దుతారు. ఫలితంగా ఇదంతా నిజమే అని భ్రమపడి పిల్లలు.. కొరియన్ గేమ్స్ నిర్వాహకులు చెప్పినట్టుగా చేస్తుంటారు. చివరికి వారు తన ప్రాణాలను కూడా కోల్పోతుంటారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో జరిగింది పైతరహా దారుణమే. అయితే ఇప్పటికీ ఈ విషయంలో ఇంకా కొన్ని తెలియని నిజాలు బయటికి రావాల్సి ఉంది. ఈ ఘటనలో ఆ ముగ్గురు పిల్లల తండ్రి చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉన్నాయి. ఇంకా దర్యాప్తు సాగుతుంది కాబట్టి ఈ వ్యవహారంలో కొన్ని విషయాలను బయటకు చెప్పడం సాధ్యం కావడం లేదు.
ఘజియాబాద్ ఘటన తర్వాత కొరియన్ గేమ్స్ పై చర్చ మొదలైంది. ముఖ్యంగా బ్లూ వేల్ గేమ్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ కూడా వ్యక్తం అవుతుంది. వేల్స్ లో బ్లూ వేల్స్ కొన్ని సందర్భాలలో ఒంటరిగా ఉంటాయి. ఆ తర్వాత ఎవరికి చెప్పకుండా తమను తాము బలవంతంగా చంపేసుకుంటాయి. కొరియన్ గేమ్ నిర్వాహకులు కూడా తమ రూపొందించిన ఆటకు బ్లూవేల్ గేమ్ అని పేరు పెట్టారు. అందులో బ్లూ వేల్ మాదిరిగానే చనిపోవాలని టాస్క్ ఇస్తుంటారు.. ఇది పిల్లల మెదడు పైన ఒక రకమైన ప్రభావాన్ని చూపుతుంది. తమకు తెలియకుండా తామే ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగొల్పుతుంది.
ఘజియాబాద్ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో దాదాపు 800 మంది దాకా యువతీ యువకులు మిస్సింగ్ అయ్యారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా కలకలం నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఘజియాబాద్ ఘటన విషయంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఢిల్లీలో 800 మంది యువతీ యువకులు మిస్సింగ్ అవ్వలేదని.. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో..ఏం చూస్తున్నారో కనిపెట్టుకొని ఉండాలి.