
ప్రశాంతంగా సాగిపోతున్న మానవుల జీవితం కరోనా మహమ్మారి విజృంభణ వల్ల పూర్తిగా మారిపోయింది. దేశంలో కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య తగ్గుతోందే తప్ప పూర్తిస్థాయిలో వైరస్ కట్టడి కావడం లేదు.
కరోనా వైరస్ వల్ల దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైరస్ పై ప్రభావవంతంగా పని చేసే కొన్ని మందులు అందుబాటులోకి వచ్చినా పూర్తిగా శరీరంలో కరోనా వైరస్ ను నిర్వీర్యం చేసే మందుల అవసరం ఉంది. తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ వల్ల ఒక ఊరే ఖాళీ అయింది.
కామారెడ్డి జిల్లాలోని బీబీపేట గ్రామ ప్రజలు ఈరోజు ఉదయం ఊరు వదిలి పంట పొలాలకు వెళ్లిపోయారు. కరోనా వైరస్ ను నియంత్రించాలనే సదుద్దేశంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ చీకటి పడే సమయానికి గ్రామస్తులు ఇళ్లకు చేరుకోనున్నారు. గ్రామస్తులు ఈరోజు ఉదయం డప్పు చప్పుళ్లతో మేకను బలి ఇచ్చి ఊరును విడిచిపెట్టి బయట ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
కొందరు గ్రామస్తులు ఇలా చేయడం వల్ల వైరస్ కట్టడి జరగడంతో పాటు కుటుంబ సభ్యులతో పొలాల్లో వంట చేసుకుని కమ్మటి రుచులను ఆస్వాదించవచ్చని వెల్లడించారు. ఇప్పుడైతే టెక్నాలజీ అభివృద్ధి వల్ల కరోనాకు మందులు అందుబాటులోకి వచ్చాయి కానీ చాలా సంవత్సరాల క్రితం ఇలా వైరస్ లు, బ్యాక్టీరియాలు విజృంభిస్తే ప్రజలు కొన్ని రోజులు ఊరి బయట ఉండి వైరస్, బ్యాక్టీరియాను కట్టడి చేసేవారని తెలుస్తోంది.