
ఈ మధ్య కాలంలో మోసగాళ్లు మోసం చేయడానికి అందుబాటులో ఉన్న ఏ మార్గాన్ని వదలడం లేదు. మోసగాళ్లు చివరకు కరోనా పరీక్షల పేరుతో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా విశాఖ జిల్లాలో మోసగాళ్లు కరోనా పరీక్షల పేరుతో వృద్ధురాలికి టోకరా వేశారు. జిల్లాలోని సీతంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు కరోనా పరీక్షలు చేస్తామంటూ ఒక వృద్ధురాలు ఇంటిలోకి ప్రవేశించి ఆమెను పరీక్షలు చేస్తున్నట్లు నమ్మించి దృష్టి మరల్చారు.
అనంతరం వృద్ధురాలి ఇంటి బీరువాలోని 7 తులాల బంగారు నగలు ఎత్తుకొని అక్కడి నుంచి ఉడాయించారు. అనుమానం వచ్చిన వృద్ధురాలు బీరువా తెరిచి చూసి అక్కడ బంగారం లేకపోవడంతో షాక్ కు గురైంది. మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు ఏం చేయాలో అర్థం కాక చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఒకవైపు కరోనా మహమ్మారి వల్ల జనాలు తల పట్టుకుని కూర్చుంటే ఈ అసాధారణ పరిస్థితిని కూడా దొంగలు అవకాశంగా మార్చుకుంటున్నారు.
మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని క్యాష్ చేసుకోవాలని మోసగాళ్లు భావిస్తున్నారు. విశాఖలోనే కాదు ఇతర జిల్లాల్లో సైతం మాటలతో గారడీ చేసి మోసాలు చేసే ముఠాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకునే విధంగా మోసగాళ్లు మోసాలకు పాల్పడుతుండటంతో విద్యావంతులు సైతం మోసపోతున్నారు.
పోలీసులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అనుమానం కలిగితే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తులు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని.. ఎవరైనా అమాయకత్వం వల్ల మోసపోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్లను పట్టుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.