
కరోనా ఫస్ట్ వేవ్ తో పోల్చి చూస్తే సెకండ్ వేవ్ లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కరోనా మరణాల సంఖ్య ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఎక్కువగా ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా సోకిన వాళ్లు మరణం నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కరోనా సోకిన వాళ్లు శ్వాసక్రియ రేటును చెక్ చేసుకోవడం, ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్ చేసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీలో నిరంతర నొప్పి లేదా ఒత్తిడి లాంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి. ఈ రెండింటినీ నిరంతరం పరిశీలించుకుంటూ ఉండటం వల్ల రెండిటి విషయంలో వచ్చే తేడాను సులభంగా గమనించడం సాధ్యమవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ 91 శాతం కంటే తక్కువగా ఉంటే మరణించే అవకాశాలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిమిషానికి 23సార్లు శ్వాస తీసుకుంటున్న వారిలో సైతం మరణాల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్యలతో బాధ పడేవాళ్లు ఆస్పత్రులలో చేరి ఆక్సిజన్ తీసుకోవడం వల్ల మరణాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. హోం ఐసోలేషన్ లో ఉండి కరోనాకు చికిత్స చేయించుకుంటున్న వాళ్లు ఈ రెండు విషయాలను నిత్యం పరిశీలించుకుంటూ ఉండాలి.
నిర్దేశించిన దానికన్నా తక్కువగా రీడింగ్ వచ్చినపుడు వెంటనే వైద్య సహాయం తీసుకుంటే మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా సులభంగా కరోనాను జయించే అవకాశాలు ఉంటాయి. కరోనా సోకిన వాళ్లు ఈ రెండు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తే మంచిది.