Covid Vaccine For Children: ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుతోంది. దీంతో ప్రజలు సాధారణ జీవితం వైపు మళ్లుతున్నారు. చాలా దేశాల్లో ఇప్పటికే మాస్కుల వినియోగం, సామాజిక దూరం వంటి ఆంక్షలను తొలగించారు. కరోనా స్థానిక వ్యాధిస్థాయికి చేరుకుందని ఇంగ్లండ్ వంటి దేశాలు ప్రకటించాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ను కూడా చాలా దేశాలు వేగంగా పూర్తి చేస్తున్నాయి. మనదేశంలో కూడా దాదాపు అర్హులైన వారందరికీ కనీసం ఒక డోసు పూర్తి అయిందని గణాంకాలు చెబుతున్నాయి.
Covid Vaccine For Children
దేశంలో కరోనా థర్డ్ వేవ్ దాదాపు ముగిసినట్లే అన్పిస్తున్నా.. జూన్ లో నాలుగో వేవ్ వస్తుందనే నిపుణుల హెచ్చరికలు మరోసారి ఆందోళనకు కారణమవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే అర్హులైన వారందరికీ దాదాపు వ్యాక్సినేషన్ పూర్తి అవగా.. బూస్టర్ డోసులు కూడా చాలా మంది తీసుకున్నారు. ఇక జనవరిలో ప్రారంభించిన టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంకు కూడా మంచి స్పందన లభించింది.
ఇప్పటికే దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ లతో పాటు తాజాగా మరో వ్యాక్సిన్ ను 12-17 సంవత్సరాల పిల్లలకు అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. దేశంలో ఇప్పటికే కోవీషీల్డ్ ను అందిస్తున్న సీరమ్ సంస్థ తాజాగా కోవావాక్స్ ను పిల్లలను అందించేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. దీనికి నిపుణుల కమిటీ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది.
కొవావాక్స్ ను పెద్దలకు అందించేందుకు గతేడాది డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. టీనేజర్లకు ఈ వ్యాక్సిన్ అందించేందుకు డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది.
Covid Vaccine For Children
ఇక ఇప్పటికే దేశంలో దాదాపు 90శాతానికి పైగా రెండు డోసుల వ్యాక్సిన్ ను పూర్తిగా పొందారని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో చాలా మంది బూస్టర్ డోసులను కూడా పొందారు.
మరోవైపు జనవరిలో మూడు లక్షలకు పైగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం పదివేల దిగువకు చేరుకోవడంతో అన్ని రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. అయితే మాస్కు వినియోగం, వ్యాక్సినేషన్ ప్రక్రియను మాత్రం కంటిన్యూ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ప్రజల్లో కూడా కరోనా తీవ్రత లేదు అనే నిర్లక్ష్యం కూడా ఉండకూడదని.. జాగ్రత్త పడాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది.