ప్రపంచం డబ్బు వెనకాల ఎందుకు పరిగెడుతుందో ఎవరికైనా అర్థం కాకపోతే.. కరోనా రోగులను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. డబ్బు ఉన్నవాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రులు గేటు తెరిచి సలామ్ కొడుతున్నాయి. లేనివాళ్లకు సాధారణ ప్రైవేటు హాస్పిటల్స్ కూడా డోర్ క్లోజ్ చేసి గెటౌట్ అంటున్నాయి. అలాంటి వాళ్లకు మిగిలేది ధర్మాసుపత్రి మాత్రమే. అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. దీంతో.. డబ్బే జీవితం అన్నదే సరైందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందుకు వస్తోంది.
దేశంలో నిత్యం కొవిడ్ కేసులు మూడు లక్షలకు చేరుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. మృతిచెందుతున్న వారిలో వందకు 90 మంది పేద, మధ్యతరగతి వాళ్లే ఉండడం గమనించాల్సిన అంశం. వీళ్లు డబ్బు ఖర్చు చేయలేనివాళ్లు.. కష్ట కష్టంగా ఒకటీ రెండు లక్షలు మాత్రమే భరించగలిగిన వాళ్లు. ఇలాంటి వాళ్లకు కరోనా వైద్యం సరిగా అందట్లేదనే చెప్పుకోవాలి.
ప్రధానంగా ఆక్సీజన్, రెమ్ డెసివర్ లాంటి మందుల కొరతతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశం మొత్తంలో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్లు ఆసుపత్రుల్లో వెంటీ లేటర్ల సౌకర్యం అతి కొద్ది ఆసుపత్రుల్లోనే ఉంది. ఇక, ఆక్సీజన్ సిలిండర్ల కొరత వేధిస్తుండడంతో.. డబ్బులు అధికంగా చెల్లించిన వారికే దొరుకుతోంది. ఒక్క రెమ్ డెసివర్ ఇంజక్షన్ ఖరీదు సుమారు 2 నుంచి 3 వేలు ఉంటుంది. కానీ.. ఇప్పుడు దాన్ని 30 నుంచి 40 వేలకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో.. సాధారణ మధ్య తరగతి ప్రజలు వైద్యాన్ని ఎలా కొనుక్కోగలరు? అందుకే.. కొందరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు ఉన్న కొద్దిపాటి డబ్బులను ప్రైవేటు ఆసుపత్రులకు ముట్టచెప్పి చనిపోతున్నారు. మరికొందరు లక్షలాది రూపాయలు అప్పులు చేసి చివరకు ప్రాణాలు కాపాడుకుంటున్నారు. బాగుపడిన తర్వాత వాటిని తీర్చేందుకు మిగిలిన జీవితాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి!
ఈ దారుణాలను ఆపడానికే ప్రభుత్వాలు ఉన్నది. కానీ.. ఎక్కడా సరైన చర్యలు తీసుకున్న దాఖలాల్లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ న్యాయస్థానాలే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ.. ప్రభుత్వాలు కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని, బ్లాక్ మార్కెట్ దందాను చూసీచూడనట్టు వదిలేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇలాంటి పరిస్థితులను చూసిన జనం.. డబ్బుకోసం వెంపర్లాడకుండా.. మానవత్వం గురించి ఎందుకు ఆలోచిస్తారు? బతుకు, భవిష్యత్ తోపాటు ప్రాణం కూడా డబ్బుతోనే నిలబడుతుందనే నగ్న సత్యం తెలిసివచ్చిన చోట.. సాటి మనిషికి సాయం చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇవన్నీ సొల్లు ముచ్చట్లుగా మారిపోవూ..?! మరి, ఈ దారుణ పరిస్థితికి కారణం ఎవరు?? దీన్ని మార్చాల్సింది ఎవ్వరు???