AP Debt Burden: ఏపీ ప్రభుత్వం ఎడా పెడా అప్పులు చేస్తోంది. ప్రతీ నెలా అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతులు కోరుతోంది. అక్కడ..ఇక్కడ అన్న తేడా లేకుండా అన్ని బ్యాంకుల వద్ద చేయి చాచేస్తోంది. ప్రతీ నెల రూ.5 వేల కోట్ల అప్పు పుడితే కానీ ఆ నెల గడవని పరిస్థితి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అప్పు అక్షరాలా రూ..7.73 లక్షల కోట్లు. ఏపీ పబ్లిక్ డెట్ ప్రస్తుతం రూ.4.13 లక్షల కోట్లు. కార్పొరేషన్ల అప్పులు రూ.2 లక్షల కోట్లు. పెండింగ్ బిల్లులు దాదాపు రూ.1.5 లక్షల కోట్లు. ఇవి కాకుండా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా, ఇతర శాఖలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్ల నుంచి తీసుకున్న డిపాజిట్లు దాదాపు రూ.10,000 కోట్లు. అయితే మూడేళ్లలో అప్పులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
అడ్డగోలు అప్పులపై జగన్ సర్కారును మరోసారి హెచ్చరించింది. కార్పొరేషన్లు చేస్తున్న అప్పులను కూడా రాష్ట్రం చేసే అప్పులుగానే చూపించాలని తేల్చి చెప్పింది. పెండింగ్ బిల్లులనూ రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని తెలిపింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌తోపాటు పలు సంస్థల ద్వారా ఏపీ సర్కారు దొడ్డిదారిలో అప్పులు తెస్తోంది. వాటికి సంబంధించిన వడ్డీలు, వాయిదాలను ఖజానా నుంచి చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాల కార్పొరేషన్ల అప్పులను (ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్) ఖజానా ద్వారానే చెల్లిస్తున్నాయని, అందుకే కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులకు జీతాలకు, పెన్షన్లకు, కార్యాలయాల నిర్వహణకు నిధులు ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. ఇకపై కార్పొరేషన్లు చేసిన అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులుగానే పరిగణిస్తామని తెలిపారు.
ఇబ్బడిముబ్బడిగా…
వాస్తవానికి కార్పొరేషన్లు ప్రత్యేక సంస్థలు. వాటి ఆర్థిక లావాదేవీలను అవే చూసుకోవాలి. అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. తిరిగి చెల్లించాల్సింది మాత్రం కార్పొరేషన్లే! కానీ… రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా అప్పుతెచ్చుకుని, తన అవసరాలకు వాడుకుని, ఆ తర్వాత ఖజానా నుంచే చెల్లింపులు చేస్తోంది. దీనికి ‘గ్రాంటు’ అనే పేరు పెట్టినప్పటికీ… ఆ మొత్తాన్ని అప్పులు, వడ్డీలు చెల్లింపులకు వాడుతున్నారు. ఈ లెక్కలు బడ్జెట్లో కూడా సరిగా చూపడంలేదంటూ 15వ ఆర్థిక సంఘం చెప్పిందని గతంలోనే కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది.
ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లోనే దీనిపై హెచ్చరికలు జారీ చేశారు. పాత అప్పులపై పక్కా వివరాలు సమర్పిస్తేనే కొత్త అప్పులకు అనుమతి ఇస్తామని ఇప్పటికే తేల్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ.80వేల కోట్ల అప్పులు ఇప్పించాలని కోరింది. కానీ… ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 40 రోజులు దాటుతున్నా కేంద్రం కఠిన వైఖరే అవలంబిస్తోంది. గత వారం తాత్కాలికంగా రూ.3వేల కోట్లు తెచ్చుకునేందుకు అంగీకరించింది. జగన్ సర్కారు రాజకీయ కోణంలో చేసిన ప్రయత్నాలే దీనికి కారణమని తెలుస్తోంది.
దివాళా దిశగా రాష్ట్రం…
వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక సీఎం జగన్ తన పరపతిని పెంచుకునేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టారన్న విమర్శలున్నాయి. నవరత్నాల కోసం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని.. అన్ని శాఖల నుంచి నిధులు మళ్లించారన్న ఆరోపణలున్నాయి. చివరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించారన్న అపవాదు ఉంది. ఇవి చాలవన్నట్టు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఇష్టారాజ్యంగా అందిన దగ్గర అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ కు ఈ పరిణామాలు విఘాతం కలిగిస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చింది. అయితే దీనిపై కేంద్ర నిఘా సంస్థలు సైతం కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయి. ప్రభుత్వం రాజకీయ పబ్బానికి పోయి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని కేంద్రం అనుమానిస్తోంది. అందుకే ఆర్థికంగా కట్టడి చేయాలని నిర్ణయించింది.
Also Read:Alliance Politics In AP: ఏపీలో పొత్తు రాజకీయం.. బీజేపీ లెక్కేమిటి?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Clarity on ap government debts center serious
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com