
కేవలం.. ప్రకటనతోనే యావత్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కాంబో.. రామ్ చరణ్ -శంకర్. భారతీయ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా పేరొందిన శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా వస్తోందని అధికారికంగా ప్రకటిచండంతో.. మెగా అభిమానుల ఆనందాన్ని హద్దే లేకుండాపోయింది.
స్వయంగా రామ్ చరణ్ ఈ విషయాన్ని రివీల్ చేయగా.. మెగాస్టార్ చిరంజీవి కూడా ధృవీకరించి, తన ఆనందాన్ని ప్రకటించారు. శంకర్ లాంటి డైరెక్షన్లో చెర్రీ నటిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్నారు. ఎస్‌వీసీ బ్యానర్‌లో 50వ చిత్రం.. రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ ప్లాన్ చేశారు.
అయితే.. ఈ సినిమాకు ఇప్పుడు అనుకోని అవాంతరం ఏర్పడేట్టు కనిపిస్తోంది. దర్శకుడు శంకర్-కమల్ కాంబినేషన్లో ఇండియన్-2 సినిమా ఎప్పుడో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూట్ దాదాపు సగం వరకు పూర్తయింది. దాదాపు 230 కోట్ల భారీ బడ్జెట్ తో చేపట్టిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
అయితే.. ఈ సినిమా విషయంలో నిర్మాతలకు, దర్శకుడికి పొంతన కుదరట్లేదు. ఈ సినిమా విషయమై పలుమార్లు వీరిమధ్య విభేదాలు వచ్చాయి. నిర్మాణం విషయంలో పలు షరతులు విధించడంతో శంకర్ అంగీకరించలేదు. ఈ క్రమంలో గొడవలు మరింత ముదిరాయి. ఈ క్రమంలో కరోనా రావడం.. విభేదాలు అలాగే ఉండడంతో.. సినిమాను ఆపేసిన శంకర్.. తాజాగా రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేశారు.
దీనిపై కోర్టుకు వెళ్లారు ఇండియన్-2 నిర్మాతలు. తమ సినిమా మధ్యలో వదిలేసి, మరో సినిమా తీస్తున్నారని, తమ సినిమా పూర్తయ్యే వరకు శంకర్ మరో సినిమా తీయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును కోరారు. దీంతో.. నెక్స్ట్ ఏం జరగబోతోందో ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంది. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? శంకర్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదంలో రామ్ చరణ్ సినిమా వాయిదా పడుతుందా? అనే ఆందోళన మెగా అభిమానుల్లో వ్యక్తమవుతోంది.