
ప్రేమకు ఫ్రెండ్షిప్ అనేది తొలి మెట్టుగా ఉన్నట్టే.. ఇండస్ట్రీలోకి వచ్చే యంగ్ హీరోలకు ప్రేమే మొదటి మెట్టుగా ఉంటుంది. ‘ప్రేమ’లో పాసైన తర్వాతనే.. యాక్షన్ సినిమాలకు అప్ గ్రేడ్ అవుతుంటారు. దాదాపు అందరి విషయంలోనూ ఈ థియరీనే కంటిన్యూ అవుతుంది. అయితే.. కొందరు వేగంగా అందులోంచి బయటపడుతుండగా.. మరికొందరు మొదటి నుంచే ప్రేమ వాసనలకు దూరంగా ఉంటారు.
టాలీవుడ్లో రానా దగ్గుబాటి, విజయ్ దేవర కొండ, నితిన్.. ప్రేమకథా చిత్రాలకు తాము రాం రాం చెప్తున్నామని ప్రకటించారు. వీరిలో నితిన్, వీడీ పలు సినిమాల్లో లవ్ ను టేస్ట్ చేసినప్పటికీ.. రానా మాత్రం ఇప్పటి వరకూ ప్రేమ వైపు కన్నెత్తి చూసింది లేదు.. హీరోయిన్ కు కన్ను కొట్టింది లేదు.
మొదటి నుంచీ దాదాపు ప్రేమకథల్లోనే కనిపించిన విజయ్ దేవరకొండ.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తన ఆఖరి లవ్ స్టోరీ అని ప్రకటించాడు. ఆ తర్వాత అడుగులు కూడా ప్రేమకు దూరంగానే పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వలో తెరకెక్కుతున్న ‘లైగర్’లో బాక్సింగ్ ఫైటర్ గా కనిపించబోతున్నాడు. ఇందులో ప్రేమపాళ్లు కథానుసారంగానే ఉండే అవకాశం ఉంది.
ఇక నితిన్ కూడా తాను ప్రేమ కథా చిత్రాల్లో నటించబోనని ఆ మధ్య ప్రకటించాడు. ఈ మధ్య వచ్చిన రంగ్ దేలో లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ.. అది ఫ్యామిలీ డ్రామాగానే తెరకెక్కింది. ప్రేక్షకులను కూడా ఆ కోణంలోనే అలరిస్తోంది.
ఇక, రానా దగ్గుబాటి గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. మొదటి సినిమా లీడర్ తోనే రాజకీయ నాయకుడిగా నటించారు రానా. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిఫరెంట్ జోనర్లలో వచ్చాయి. కానీ.. అందులో ఒక్కటి కూడా ప్రేమ కథా చిత్రం లేదు. దీనికి రానా ఏం చెబుతున్నాడంటే.. తనకు కాలేజ్ డేస్ లోనూ లవ్ లేదని, తనకు లవ్ స్టోరీస్ సెట్ కావని అంటున్నాడు.
అయితే.. ఒక్కటి మాత్రం వాస్తవం. హీరో ఎవరైనా వెండి తెరపై పది కాలాలపాటు కొనసాగాలంటే యాక్షన్ హీరోగా టర్న్ తీసుకోవాల్సిందే. లేత బుగ్గలున్నప్పుడు ప్రేక్షకులు ప్రేమికుడిగా అంగీకరిస్తారు గానీ.. ముదురు గడ్డం వేసుకొని లవర్ బాయ్ ని అంటే అద్దం చూసుకోమనే అవకాశమే ఎక్కువ. అందుకే.. హీరోలు సాధ్యమైనంత త్వరగా.. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు ట్రై చేస్తుంటారు.
మరోవైపు.. రొటీన్ లవ్ స్టోరీలను అంగీకరించడానికి కూడా ప్రేక్షకులు సిద్ధంగా లేరు. వారి అభిరుచి కూడా వేగంగా మారుతోంది. విభిన్నమైన కథలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. స్టార్ డమ్ కూడా ఇలాంటి సినిమాల్లో నటించిన వారికే పెరుగుతోంది. ఇన్ని కారణాల నేపథ్యంలోనే హీరోలకు ప్రేమంటే చేదెక్కిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్