‘సాగర సంగమం’.. సినిమా మొదలైన పది నిమిషాల లోపే.. ఇది బాలు అనే ఓ పచ్చి తాగుబోతు కథ అని ఈ సినిమా పరిచయం అవుతుంది. చిందరవందరగా జుట్టూ, గడ్డమూ చూస్తేనే అతను పక్కా లూజర్ అని అర్ధమైపోతుంది. కానీ దర్శకత్వపరంగా తెలుగులో వచ్చిన గొప్ప సినిమాలు ఏమున్నాయి అని లెక్క పెట్టుకుంటే.. ముందువరుసలో నిలిచే సినిమా ‘సాగర సంగమం’. ఈ అత్యంత గొప్ప సినిమా పుట్టడానికి ఓ పిచ్చివాడు కారణం అట. కళాతపస్వి విశ్వనాథ్ తన కథలను చుట్టూ ఉన్న మనుషులను చూసి రాసుకుంటారు.
విశ్వనాథ్ గారు చిన్న తనంలో ఆయన ఊరిలో ఓ పిచ్చివాడు ఉండేవాడు అట. నల్లగా మాసిపోయిన చొక్కా, చిరిగిపోయిన ప్యాంటు, విపరీతంగా పెరిగిన జుట్టు ఇలా ఆ పిచ్చివాడి రూపం విశ్వనాథ్ గారిలో బలంగా నాటుకుపోయింది. అవి ‘సాగర సంగమం’ సినిమా చేయడానికి ముందు రోజులు. కొత్త కథ రాయాలి అని విశ్వనాథ్ గారి ఆలోచన. కానీ ఆయనకు ఎందుకో ఆ పిచ్చివాడే గుర్తొచ్చే వారు.
అలా తెలియకుండానే ఆ పిచ్చివాడు గురించి విశ్వనాథ్ గారు ఆలోచించడం మొదలుపెట్టారు. అతను ఎప్పుడూ ఫుట్ పాత్ మీద కూర్చునో, తిరుగుతూనో ఉండేవాడు. విశ్వనాథ్ కూడా అందరిలానే అతన్ని చూసి తప్పుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే, ఆ పిచ్చి వాడు ఎవరినీ ఎప్పుడు చేయిచాపి ఏమీ అడగడు. కానీ, అలవాటైన షాపుల వాళ్ళ దగ్గరకు మాత్రం వెళ్లి నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవాడు.
ఇదే దృశ్యం జ్ఞాపకానికి వచ్చింది విశ్వనాథ్ గారికి. లోకజ్ఞానం లేకపోయినా, ఈ లోకం హేళన చేస్తున్నా… తనకంటూ ఓ ప్రపంచాన్ని ఓ పద్దతిని సృష్టించుకున్న ఆ పిచ్చివాడే తనే హీరో అని విశ్వనాథ్ అప్పుడు ఫిక్స్ అయ్యారు. అలా అతని పాత్ర గురించి ఆలోచిస్తూ కథ మొదలు పెట్టి.. ‘సాగర సంగమం’ సినిమాని తీసుకొచ్చారు.
నిజంగా.. టోటల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయిన ఒక వ్యక్తి పాత్రను ఎమోషనల్ గా మలిచారు. జీవితంలోనూ, ప్రేమలోనూ.. అన్నీ కోల్పోయి కాటికి కాళ్ళు చాచి ఉన్న ఒక అసమర్ధుడి ఆలోచనలను అద్భుతంగా తెర పై ఆవిష్కరించారు. అందుకే కె. విశ్వనాథ్.. కళా తాపస్వి అయ్యారు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దక్షిణ భారతదేశంలో అన్నీ భాషల్లోనూ విడుదలై 100 రోజుకు పైగా ఆడిన మొదటి చిత్రం ఇదే.
