Celebrities Died in 2022: కరోనా మహమ్మరి మనదేశంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి నుంచి ఎంతోమంది ప్రముఖులు కాలం చేశారు. ముఖ్యంగా సినీ పరిశ్రమను కరోనా మహ్మమరి ఆర్థికంగానే కాకుండా ప్రముఖులను పొట్టనపెట్టుకొని ఈ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి తీసుకెళ్లింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సినిమా షూటింగులు మొదలుకావడంతో తిరిగి మాములు స్థితికి చేరుకుంటోంది.

2022 సంవత్సరంలోనూ చాలామంది సినీ ప్రముఖులు కరోనా, ఇతరత్ర అనారోగ్య సమస్యలతో మృత్యువాతపడ్డారు. ఈ లిస్టులో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సింగర్స్, నటీనటులు ఉండటం ఒకింత శోచనీయంగా మారింది. ఈరోజు ఉదయమే టాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత అయిన బాలయ్య(92) మృతిచెందారు.
పుట్టిన రోజునే ఆయన మృతిచెందడటం అందరినీ కలిచివేసింది. దాదాపు 300లకు పైగా సినిమాల్లో బాలయ్య నటించారు. బాలయ్య నిర్మాతగా అమృత ఫిల్మ్స్ బ్యానర్లో ‘చెల్లెలి కాపురం’(శోభన్ బాబు హీరో).. ‘నేరము- శిక్ష’(కృష్ణ).. ‘చుట్టాలున్నారు జాగ్రత్త’.. ‘ఊరికిచ్చిన మాట’(చిరంజీవి) వంటి చిత్రాలను నిర్మించారు.
ఏప్రిల్ 1 సినీయర్ దర్శకుడు శరత్ మృతిచెందారు. కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసారు. సుమన్ హీరోగా నటించిన ‘చాదస్తపు మొగుడు’ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతిని తన పాటలతో ప్రజలకు చేరువ చేసిన కందికొండ యాదగిరి అనారోగ్యంతో మార్చి 12న మృతిచెందారు.
మహాభారత్‌లో భీముడిగా గుర్తింపు పొందిన ప్రవీణ్ కుమార్ సోబ్తీ ఫిబ్రవరి 8న అనారోగ్యంతో మృతిచెందారు. ప్రముఖ రచయిత, దర్శక నిర్మాత అయిన రవి టాండన్ ఫిబ్రవరి 11న ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న కన్నుమూశారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వరరావు కూడా మార్చి 12 న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. మలయాళీ నటుడు ప్రదీప్ కొట్టాయమ్ గుండెపోటుతో ఫిబ్రవరి 17న కన్నుమూసారు. ‘రాజా రాణి’,‘ఏమాయ చేసావే’ చిత్రాల్లో నటించారు. సీనియర్ నటి కేపీఏసీ లలిత ఫిబ్రవరి 22న త్రిపుణితురలో మృితిచెందారు. 550కి పైగా చిత్రాల్లో ఆమె నటించింది.
బాలీవుడ్ కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన సంగీత దర్శకుడు బప్పీలహరి ఫిబ్రవరి 16న మృతిచెందారు. బెంగాలీలోతన గానామృతంతో అలరించిన సంధ్య ముఖర్జీ ఫిబ్రవరి 15న మరణించారు. పంజాబీ నటుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో ఫిబ్రవరి 16న మృతిచెందారు.
శంకర్ దాదా, అరుంధతి వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కొంచాడ శ్రీనివాస్ జనవరి 19న అనారోగ్య సమస్యతో మృతిచెందారు. ప్రముఖ కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ జనవరి 17న గుండెపోటుతో మృతిచెందారు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు జనవరి 8న అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రముఖ సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి జనవరి 3న కన్నుముశారు.