
ఒకప్పుడు కలెక్షన్ కింగ్ అంటూ ప్రేక్షకులు మోహన్ బాబు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందించేవారు. దానికి తగ్గట్టే అన్నట్టు మోహన్ బాబు నటన, అలాగే ఆయన వాచకం ఇప్పటికీ వైవిధ్యమే. నిజానికి ఆ రోజుల్లో.. అంటే, ముఖ్యంగా ఇరవై ఐదేళ్ల క్రితం మాట. మోహన్ బాబుకి స్టార్ హీరో ఇమేజ్ ఉండేది. ఆయన సినిమాలకు విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చేవి.
కాకపోతే కొత్త హీరోల ఎంట్రీ.. మరోపక్క పెరిగిన వయసు, ఈ మధ్యలో వారసుల ఎంట్రీ, వారి సినిమాలు ఇలా మొత్తానికి దాదాపు రెండు దశాబ్దాలుగా మోహన్ బాబు తన వైభోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పైగా తన వయసుకు తగిన పాత్రలు పట్టుకోవడంలో కూడా మోహన్ బాబు నిరాశ పరిచారు. ఆ మధ్య ఆర్జీవీతో రౌడీ అంటూ ఓ సినిమాని నమ్మి కాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టి తీశారు గానీ, ఆ సినిమా హీరోగానూ, అలాగే అటు నిర్మాతగానూ కనీసం వర్కౌట్ కాలేదు.
ప్రస్తుతం మోహన్ బాబు చాల గ్యాప్ తరువాత, తన వయసుకు తగిన పాత్రలో, అలాగే తనకు కరెక్ట్ గా సరిపోయే కథలో మోహన్ బాబు నటించబోతున్నారు. సినిమా టైటిల్ నే ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే అర్ధవంతమైన పేరును పెట్టుకున్నారు. మొత్తమ్మీద చాలా కాలం తరువాత మోహన్ బాబు తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు వీలుగా ఈ సినిమా చేస్తున్నాడట. ఎలాగైనా హిట్ కొట్టాలని రెండు దశాబ్దాలుగా కంటున్న కల మరి ఈ సినిమాతో తీరుతుందా ?
డైమండ్ రత్నంబాబు అనే మాటల రచయిత కాస్త గట్టిగా నమ్ముతూ చేస్తోన్న సినిమా ఇది. ఇక డైలాగ్ రైటర్ గా పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నంబాబు ఓ కథను తయారుచేసి మోహన్ బాబుకు వినిపించి సినిమా తీస్తున్నాడు. కథ, కథనం సంగతులు బాగున్నా, బాగా లేకపోయినా, మోహన్ బాబు అయితే ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.