
సినిమాకి ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. ఆ మాటకొస్తే అసలు రోజురోజుకూ సినిమాల పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. ఇలాగే మరో నాలుగు నెలలు ఉంటే ఏమిటి పరిస్థితి ?.. మొత్తంగా కోవిడ్ సెకండ్ వేవ్, సినీ లోకం తాట తీస్తోంది అనుకోవాలి. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా తమ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.
త్వరలో విడుదల కావాల్సిన “లవ్ స్టోరీ”, “విరాటపర్వం”, “టక్ జగదీష్” “పాగల్” వంటి మీడియం రేంజ్ సినిమాలే కాదు ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు వాయిదాల బాట పట్టక తప్పట్లేదు. మళ్ళీ కోవిడ్ ఇలా సినిమాల రిలీజ్ డేట్లు ను అస్తవ్యస్తం చేస్తోందని ఎవ్వరూ ఊహించలేదు. సినిమా పరిశ్రమ పెద్ద గండం నుండి బయట పడిందని అందరూ సంతోషంగా ఉన్న టైంలో సడెన్ గా సెకెండ్ వేవ్ ఎటాక్ చేసింది.
దాంతో, పెద్ద సినిమాలకు చాల పెద్ద దెబ్బ తగిలేలా ఉంది. ముఖ్యంగా ‘రాధేశ్యామ్’ పై ఈ సెకెండ్ వేవ్ ప్రభావం ఎక్కువుగా ఉండే అవకాశం ఉంది. ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రూపొందుతోన్న ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ను జులై 30కి అనుకున్నారు. అప్పటిలోగా ఈ సినిమాని పూర్తి చేయడానికి టీమ్ బాగానే కష్టపడుతుంది. కానీ, ఇప్పుడు టీమ్ లో ఒక కీలక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో.. . బ్యాలెన్స్ మిగిలి ఉన్న ఒక పాట షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేసారు.
అయితే ఈ సాంగ్ వచ్చే నెలలోనైనా పూర్తి చెయ్యొచ్చు. కానీ మరో పెద్ద సమస్య ఏమిటంటే.. ఇప్పుడున్న కోవిడ్ చూపిస్తోన్న ప్రభావాన్ని బట్టి.. జులై 30 నాటికీ సినిమా మార్కెట్ కోలుకుంటుందా.. కోలుకున్నప్పటికీ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయాలి. హిందీ వెర్షన్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాల ఉన్నాయి. ఈ నెల కోవిడ్ తో పనులు ఆగిపోతే.. జులై 30 లోపు సినిమా హిందీ వెర్షన్ పూర్తి అవ్వదు. తెలుగు వెర్షన్ రెడీగా ఉన్నా.. హిందీ వెర్షన్ రెడీ అయ్యేవరకూ సినిమాని రిలీజ్ చేయరు.