
కరోనా కేసులు రోజురోజుకూ అతి వేగంగా పెరుగుతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ లో ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటం.. పైగా కరోనాతో కొంతమంది ప్రముఖులు చనిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.
తాజాగా స్టార్ హీరో ఎన్టీఆర్ కు కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఎన్టీఆర్ మెసేజ్ పోస్ట్ చేస్తూ ‘‘కరోనా పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను, నా ఫ్యామిలీ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఇటీవల నన్ను కలిసిన వారందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సింది కోరుతున్నా’’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టెన్షన్ లో పడేసింది. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు అప్పుడే సోషల్ మీడియా పూజలు స్టార్ట్ చేసేసారు. మరోపక్క ఇలాగే కరోనా కేసులు మరీ ఎక్కువగా వస్తే.. వచ్చే నెల నుండి షూట్స్ ఎలా చేయాలా అంటూ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. షూటింగ్ స్పాట్స్ లో కరోనా కలకలం సృష్టిస్తే.. ఒక్కసారిగా ఆ స్పాట్ లో ఉన్న వందమందికి పైగా కరోనా సోకుతుంది. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో ఇలా వరుసగా కేసులు వస్తుండంతో.. మిగిలిన మేకర్స్ లో ఆందోళన మొదలైంది.