
ఏప్రిల్ 4 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుక టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ప్రసారమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ను ఏకంగా లక్షా 36 వేల మంది వీక్షించారు. ఇప్పటి వరకూ తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో చిత్రానికి కూడా ఈ రేంజ్ లో వ్యూస్ రాలేదు.
అయితే.. ఈ సినిమాలో రౌడీ బాయ్స్ కనిపించారు. వారిని కూడా చిత్ర నిర్మాత దిల్ రాజు పంపించారు! అదేంటీ.. ఫంక్షన్లో గొడవేమీ జరగలేదని అనుకుంటున్నారా? వాళ్లు గొడవ పెట్టేందుకు వచ్చిన రౌడీ బాయ్స్ కాదు.. తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన ‘రౌడీ బాయ్స్’.
విషయం ఏమిటంటే.. తన సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన సినిమా ‘రౌడీ బాయ్స్’. 2019 దసరా టైమ్ లో కొబ్బరి కాయకొట్టిన ఈ చిత్రం.. కరోనా వంటి అనివార్య కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి సక్సెస్ ఫుల్ గా ఇటీవల షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని.. హుషారు చిత్ర దర్శకుడు శ్రీహర్ష కొనెగంటి తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే.. ఈ చిత్రానికి వకీల్ సాబ్ ఈవెంట్లో భారీగా ప్రచారం కల్పించారు. ప్రతీ యాడ్ కు మధ్య ‘రౌడీ బాయ్స్’ ప్రోమో సాంగ్ ను ప్లే చేశారు. ఆ విధంగా.. అటు పవన్ సినిమా ఈవెంట్లో ఈ సినిమాను కూడా ప్రమోట్ చేశారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లోపు విడుదల చేయాలని చూస్తున్నారు.