
తెలుగు సినిమాల మార్కెట్ రేంజ్ అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. బడ్జెట్ కోటాను కోట్లు దాటి సెంచరీలు కొడుతూ వెళ్లిపోతోంది. వసూళ్లు కూడా ఆ స్థాయిలోనే ఉండడంతో.. బయ్యర్లు కూడా సూట్ కేసులు పట్టుకొని నిర్మాతల వెంటపడుతున్నారు. సాధారణ సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా.. స్టార్ల విషయానికి వచ్చే సరికి.. బయ్యర్ల మధ్య పోటీ ఓ రేంజ్ లో ఉంటోంది.
ఎప్పుడో ఆగస్టులో విడుదల కావాల్సిన ‘పుష్ప’, ఇంకెప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘సర్కారు వారి పాట’ సినిమాలను కొనుక్కునేందుకు ఇప్పుడే పోటీపడుతుండడం విశేషం. ఈ రెండు సినిమాలకు సంబంధించి లేటెస్ట్ గా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఉత్తరాంధ్ర హక్కులు కొనుగోలు చేసేందుకు భారీ మొత్తం చెల్లించడాని క్యూ కడుతున్నారట.
బన్నీ-సుక్కూ కాంబోలో వస్తున్న పుష్పపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. బన్నీ కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం కోసం సుమారు 170 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు.. సూపర్ స్టార్ మహేష్ బాబు-పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ కూడా భారీ బజ్ క్రియేట్ చేసింది. గీతగోవిందం వంటి హిట్ తర్వాత పరశురామ్ తీస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉండడంతో.. సక్సెస్ జర్నీ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
అయితే.. ఈ రెండు సినిమాల హక్కులు దక్కించుకోవడానికి పోటీపడుతున్నారట. ఇప్పటికే.. పుష్ప డీల్ కంప్లీట్ అయ్యిందని కూడా చెబుతున్నారు. ఉత్తరాంధ్ర హక్కులను గాయత్రి ఫిలిమ్స్ సంస్థ 15 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అటు సర్కారు వారి పాట రైట్స్ కోసం ఏవీ సినిమాస్, గాయత్రి ఫిలిమ్స్ పోటీ పడుతున్నట్టు సమాచారం. ఈ మూవీకి కూడా 15 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఈ విధంగా ఇద్దరు స్టార్ల సినిమాలకు మంచి పోటీ, డిమాండ్ నెలకొంది.