రాజకీయాల్లోనే కాదు సినిమాల్లోనూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అది 1970 నాటి కాలం. ఆ రోజుల్లో సినిమాలను ఎక్కువగా కలిసి నిర్మించేవారు. అయితే, సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప పార్ట్నర్స్ అయినా సరే, నాలుగైదు సినిమాలకు మించి ఎక్కువ కలిసి సినిమాలు చేయలేరు. క్రియేటివ్ ఫీల్డ్, పైగా ఇగోలకు పుట్టినిల్లు సినిమా ఇండస్ట్రీ.
అయితే ఇలాంటి ఏ కారణాలతో కాకుండా ఓ అమ్మాయి వల్ల కూడా ఓ ఇద్దరు నిర్మాతలు వీడిపోయారు. ఆ నిర్మాతలు మాగంటి వెంకటేశ్వరరావు, మురళీమోహన్. జయభేరి బ్యానర్ లో వీరిద్దరూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. వీరి కలయికలో వచ్చే సినిమాలకు ఆ రోజుల్లో మంచి డిమాండ్ ఉండేది. పైగా ఇద్దరూ నీతి నిజాయితీకి పర్యాయపదాలుగా ఉండేవాళ్ళు.
కానీ, వీరి మధ్య కూడా ఒక ఇబ్బంది వచ్చింది. మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో చనువు ఏర్పడింది. అప్పటికే ఆయనకు పెళ్ళైంది. అయినప్పటికీ, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో, ఆ రోజుల్లో ఆయన పై చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మురళీమోహన్ గారికి ఇదంతా నచ్చట్లేదు. ఆయనకి తప్పు అనిపించింది,
మాగంటి వెంకటేశ్వరరావుగారికి ఎన్నో సార్లు చెప్పి చూశారు. కానీ ఆయన మాత్రం ‘నా పర్సనల్ విషయంతో నీకు ఏ సమస్య రాదు’ అంటూ మురళీమోహన్ గారికి నచ్చచెప్పడానికి చూశారు. ఈ క్రమంలోనే రెండు సినిమాలు నిర్మించారు. రెండు సూపర్ హిట్. మరోపక్క వీరి కాంబినేషన్ కి విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. కానీ, మురళీమోహన్ కి ఎక్కడో అసంతృప్తి. ఏదో తప్పు చేస్తున్నాననే భావన.
అందుకే, నేరుగా మాగంటి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ‘మురళీమోహన్ పార్ట్ నర్ ఇలాంటి పని చేశాడట అంటే నేను సహించలేను. కాబట్టి, మనం ఇక కలిసి సినిమాలు చేయడం మానేద్దాం’ అంటూ అక్కడిక్కడే మంచి బజ్ ఉన్న కాంబినేషన్ కి స్వస్తి చెప్పి అక్కడ నుండి మురళీమోహన్ వచ్చేశారు. మంచి కాంబినేషన్ని వ్యక్తిగత లోపాలను దృష్టిలో ఉంచుకుని ఇంకొకరైతే వదులుకునేవారు కాదేమో, కానీ మురళీమోహన్ గారు వదులుకున్నారు. ఆయన అంత పర్ఫెక్ట్ గా బిజినెస్ చేసేవారు. అందుకే గొప్ప బిజినెస్ మెన్ అయ్యారు.