ఏదేశమేగినా.. ఎందుకాలిడినా.. ఇప్పుడు కరోనా కల్లోలంలో అసలు రోగమొస్తేనే దడ పుడుతుంది. ఆస్పత్రులకు వెళితే ఇల్లు వాకిలీ అమ్ముకొని చికిత్సలకు సొమ్ములు కట్టాల్సిందే. ఇక టెస్టుల పేరిట దోపిడీ ఎక్కువైపోయింది. అందుకే ఇప్పుడు తెలంగాణసర్కార్ తీసుకున్న నిర్ణయం అందరికీ ఊరటనిచ్చేలా ఉంది.
తెలంగాణలోని మొత్తం 19 జిల్లా కేంద్రాల్లో వివిధ వైద్య పరీక్షల కోసం కేసీఆర్ సర్కార్ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 7న వీటన్నింటిని ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, పలు అంశాలపై ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. ఈ మేరకు వైద్య పరీక్షల కోసం జనం పడుతున్న బాధ వారి కష్టాలు తీర్చేందుకు డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం రోగానికి చికిత్స కంటే టెస్టులకే ఎక్కువ ఖర్చు అవుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉచిత వైద్యం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నామని.. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. మహబూబాబాద్, భద్రాద్రి, ఆసిఫాబాద్, గద్వాల్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ పథకానికి త్వరలోనే ఓ మంచి పేరు పెడుతామని సీఎం తెలిపారు.
ఇలా పేద రోగులు, ప్రజల కష్టాలు తీర్చేలా సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.