సినీ నటుడు రజనీకాంత్ ఆరోగ్యంపై ఆదివారం ఉదయం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ ప్రకటించారు. రజనీ డిశ్చార్జ్ పై మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. వైద్య పరీక్షలన్నీ నార్మల్ గానే ఉన్నాయన్నారు. నిన్నటికంటే ఈరోజు ఆరోగ్యం మరింత మెరుగైందని, ప్రస్తుతం బీపీ కంట్రోల్ లోనే ఉందని వైద్యులు తెలిపారు. ఈనెల 25న హైబీపీ తో రజనీ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు ఆయన ‘అన్నాత్తే’ షూటింగ్ లో పాల్గొన్నారు. చిత్రం యూనిట్ లో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత రజనీకి హైబీపీ రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా అపోలో వైద్యులు రజనీ బీపీ నార్మల్ గా ఉందని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు.