Zomato: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న జొమాటో తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇకపై తమ పాపులర్ 15 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీసులు ‘జొమాటో క్విక్’,’జొమాటో ఎవ్రీడే’లను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. లాభాలు ఆశించిన స్థాయిలో రాకపోవడం, కస్టమర్ ఎక్స్ పీరియన్స్ సరిగ్గా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. “కస్టమర్ ఎక్స్ పీరియన్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ రెండు ప్రయత్నాల్లోనూ లాభం చేకూర్చే మార్గం మాకు కనిపించలేదు. అందుకే వీటిని మూసివేస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రెస్టారెంట్ డెన్సిటీ, కిచెన్ మౌలిక సదుపాయాలు 10-15 నిమిషాల్లో డెలివరీ చేయడానికి అనుకూలంగా లేవని, దీనివల్ల కస్టమర్లకు సరైన ఎక్స్ పీరియన్స్ లభించలేదని ఆయన వివరించారు.
Also Read : మహిళలకు రూ.50 వేలు రుణం ఇస్తున్న ప్రభుత్వం.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి..
ఏంటీ ఈ జొమాటో క్విక్, ఎవ్రీడే సర్వీసులు?
‘జొమాటో క్విక్’ అనేది 2 కిలోమీటర్ల పరిధిలోని సెలెక్టెడ్ రెస్టారెంట్ల నుంచి రెడీగా ఉన్న ఆహారాన్ని 15 నిమిషాల్లో డెలివరీ చేసే సర్వీస్. మరోవైపు, ‘జొమాటో ఎవ్రీడే’ అనేది మెట్రో నగరాల్లోని ఆఫీస్‌కు వెళ్లే వారి కోసం ఇంటి భోజనం అందించే పైలట్ ప్రాజెక్ట్. అయితే, ఈ ‘ఎవ్రీడే’ సర్వీస్‌కు డిమాండ్ లిమిటెడ్ గా ఉందని.. ఇది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగకరంగా ఉందని కంపెనీ గుర్తించింది.
ఇది రెండోసారి ఎదురుదెబ్బ
అల్ట్రా-ఫాస్ట్ డెలివరీలో జొమాటోకు ఇది రెండోసారి ఎదురుదెబ్బ తగిలింది. అంతకుముందు 2022లో కంపెనీ ‘జొమాటో ఇన్‌స్టంట్’ పేరుతో 10 నిమిషాల డెలివరీ సేవను ప్రారంభించి, జనవరి 2023లో దానిని మూసివేసింది. జొమాటో క్విక్‌ను కేవలం నాలుగు నెలల క్రితమే ప్రారంభించినప్పటికీ అది కూడా కస్టమర్ల అంచనాలను అందుకోలేకపోయింది.
ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే
జొమాటో సీఎఫ్‌ఓ అక్షంత్ గోయల్ ఇదివరకే 10-15 నిమిషాల డెలివరీ సర్వీస్ మెయిన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ మీద పెద్దగా ప్రభావం చూపడం లేదని సంకేతాలు ఇచ్చారు. దీనికి తోడు ఈ విభాగంలో స్విగ్గీ ‘బోల్ట్’, జెప్టో వంటి కొత్త పోటీదారులు పెరుగుతుండంతో జొమాటోపై ఒత్తిడి పెంచింది. స్విగ్గీ, బోల్ట్ కేవలం రెండు నెలల్లోనే 5శాతం ఫుడ్ డెలివరీ ఆర్డర్‌లలో భాగమై, 400 కంటే ఎక్కువ నగరాలకు విస్తరించింది.
జొమాటో భవిష్యత్ ప్రణాళిక ఇదే
జొమాటో ఇప్పుడు తన క్విక్ డెలివరీ వ్యూహాన్ని ప్రధాన యాప్ నుండి తొలగించి, తన అనుబంధ సంస్థ బ్లింకిట్ డార్క్ స్టోర్ నెట్‌వర్క్ ద్వారా కేంద్రీకరించాలని యోచిస్తోంది. కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లో ‘బిస్ట్రో బై బ్లింకిట్’ను ప్రారంభించింది. ఇది పాస్టెస్ట్ డెలివరీపై దృష్టి సారిస్తుంది.