Homeబిజినెస్Xiaomi YU7: షివోమీ ఎలక్ట్రిక్ కారు దుమ్ము రేపుతోంది.. 835 కి.మీ. రేంజ్.. టెస్లా కంటే...

Xiaomi YU7: షివోమీ ఎలక్ట్రిక్ కారు దుమ్ము రేపుతోంది.. 835 కి.మీ. రేంజ్.. టెస్లా కంటే తక్కువ ధర!

Xiaomi YU7: స్మార్ట్‌ఫోన్లు తయారు చేసే షివోమీ(Xiaomi) కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు అదే కంపెనీ కార్ల మార్కెట్లోకి కూడా దిగి, అదరగొడుతోంది. వాళ్ల కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ YU7 ను చైనాలో లాంచ్ చేశారు. దీని స్టార్టింగ్ ధర కేవలం 2,53,000 యువాన్లు అంటే, మన డబ్బుల్లో సుమారు రూ.30.26 లక్షలు మాత్రమే. షావోమీ SU7 సెడాన్ తర్వాత ఇది వాళ్ల రెండో కారు. ఈ కారులో అదిరిపోయే టెక్నాలజీ, సూపర్ పర్ఫార్మెన్స్, ఇంకా నచ్చినట్టు మార్చుకునే ఆప్షన్లు బోలెడు ఉన్నాయంట.

ఈ కారు గురించి ఒక పెద్ద విశేషం ఏంటంటే.. లాంచ్ అయిన కేవలం 18 గంటల్లోనే 2.4 లక్షల మందికి పైగా బుక్ చేసుకున్నారు. ప్రపంచంలో ఏ ఎలక్ట్రిక్ కారుకు కూడా ఇంత వేగంగా బుకింగ్‌లు రాలేదంట. ఇది షావోమీ ఎంత పాపులర్ అవుతుందో చూపిస్తోంది. అంతేకాదు, ధర విషయంలో ఇది టెస్లా మోడల్ వై కారు కంటే దాదాపు 4శాతం తక్కువ.

ఈ ఎస్‌యూవీ లోపలి భాగం చాలా లగ్జరీగా ఉంది. చూడగానే నోరు వెళ్లబెట్టే ఫీచర్లు ఉన్నాయి. పైన్ గ్రే, కోరల్ ఆరెంజ్, ఐరిస్ పర్పుల్ లాంటి డ్యూయల్-టోన్ సీట్ ఆప్షన్లు ఉన్నాయి. ముందు సీట్లలో 10 పాయింట్ల మసాజ్ ఫంక్షన్ ఉంది. అంటే ప్రయాణంలో కూడా హాయిగా మసాజ్ చేసుకోవచ్చు. జీరో-గ్రావిటీ మోడ్ కూడా ఉందంట, అంటే సీటును బాగా వెనక్కి వంచి, బరువు లేకుండా తేలికైన అనుభూతి పొందేలా చేస్తాయి.

వెనక సీట్లను కూడా 135 డిగ్రీల వరకు వెనక్కి వంచొచ్చు. అంటే లాంగ్ జర్నీల్లో నిద్రపోవాలంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. 16.1 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్మార్ట్ డిమ్మింగ్ పనోరమిక్ సన్‌రూఫ్, AI వాయిస్ అసిస్టెంట్ లాంటివి ఉన్నాయి. Xiaomi Pad 7S Pro కోసం సీట్ మౌంట్లు, ప్రొజెక్టర్ కనెక్టివిటీ, ఇంకా 25 స్పీకర్ల సౌండ్ సిస్టమ్ అంటే సినిమా హాల్ ఫీలింగ్ వస్తుందన్నమాట!

4.6 లీటర్ల చిన్న ఫ్రిజ్ కూడా ఇందులో ఉంది. ప్రయాణంలో చల్లటి డ్రింక్స్, స్నాక్స్ పెట్టుకోవచ్చు. ఐఫోన్ వాడే వాళ్లకి కొన్ని ప్రత్యేక కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్‌లోని యాక్షన్ బటన్ నుంచి కారును లాక్/అన్‌లాక్ చేయొచ్చంట. షివోమీ YU7 చాలా స్పోర్టీ లుక్‌తో డిజైన్ చేశారు. ఇది లో-స్లంగ్ బాడీ, వెడల్పాటి వెనుక భాగంతో వస్తుంది. చూడగానే ఇది ఒక పవర్ఫుల్ కారు అనిపిస్తుంది.

బాసాల్ట్ గ్రే, ఎమరాల్డ్ గ్రీన్, డస్క్ పర్పుల్, డాన్ పింక్ లాంటి 9 రకాల కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 19 అంగుళాల లాంగ్-రేంజ్ అలాయ్ వీల్స్, 21 అంగుళాల పర్ఫార్మెన్స్ వీల్స్ ఉన్నాయి. ఫ్లోటింగ్ షివోమీ లోగో కూడా దీని డిజైన్‌కు మరింత అందాన్ని ఇస్తుంది. షివోమీ తమ స్మార్ట్ ఛాసిస్ సిస్టమ్‌తో కారు ప్రయాణాన్ని చాలా స్మూత్‌గా, ప్రీమియంగా మారుస్తుంది.

ఇందులో 5-లింక్ రియర్ సస్పెన్షన్, డ్యూయల్-ఛాంబర్ ఎయిర్ స్ప్రింగ్స్, ఇంకా అడాప్టివ్ డ్యాంపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కారుకు మంచి పట్టును ఇచ్చి, గుంతలు, రోడ్డుపై ఉండే ఒడుదొడుకులు తెలియకుండా చేస్తాయి. ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే.. మోషన్ సిక్‌నెస్ రిలీఫ్ మోడ్. ఇది ప్రయాణంలో వచ్చే వాంతులు, కళ్లు తిరగడం లాంటి సమస్యలను 51శాతం వరకు తగ్గిస్తుందట. ఈ ఫీచర్‌ను ఆసుపత్రుల సహకారంతో తయారు చేశారు. అంటే, ఈ మధ్య కారులో ప్రయాణిస్తుంటే వాంతులు అవుతున్నాయని ఫీల్ అయ్యేవాళ్లకి ఇది మంచి వార్త.

షావోమీ YU7 ను మూడు వేరియంట్లలో రిలీజ్ చేసింది. స్టాండర్డ్ (RWD) వేరియంట్. ఇది 835 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ప్రో (AWD) వేరియంట్ 770 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ది పర్ఫార్మెన్స్ మోడల్. దీని టాప్ స్పీడ్ గంటకు 253 కి.మీ. ఈ వేరియంట్ కేవలం 2.98 సెకన్లలోనే 0 నుంచి గంటకు 100 కి.మీ స్పీడ్‌ను అందుకుంటుంది.

అన్ని వేరియంట్లలోనూ అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. బ్యాటరీ కేవలం 12 లేదా 15 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు చార్జ్ అవుతుందట. ఒకసారి చార్జింగ్ చేస్తే 620 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మొత్తంగా, షివోమీ YU7 ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో పెద్ద సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version