WhatsApp Username Feature : ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీని మాతృసంస్థ మెటా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మొబైల్ నంబర్‌ను ఇతరులతో పంచుకోకుండానే చాటింగ్ చేసే అవకాశం కల్పించాలని చూస్తోంది. ఇందుకోసం Username వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ ఫీచర్‌పై భారత్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మెటాకు నోటీసు జారీ చేసింది. ఈ ఫీచర్ అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆదేశించినట్లు సమాచారం. అసలు ఈ ఫీచర్ పై కేంద్రం ఎందుకు ఆందోళన చెందుతోంది? దీని వల్ల ఉండే ప్రమాదాలేంటి?
వాట్సాప్ Username ఫీచర్ అంటే ఏమిటి?
ప్రస్తుతం వాట్సాప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే వారి మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. కొత్త Username ఫీచర్ అందుబాటులోకి వస్తే, ప్రతి యూజర్ తనకు నచ్చిన ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను సృష్టించుకోవచ్చు. ఆ యూజర్‌నేమ్ ద్వారానే ఇతరులు సంప్రదించగలుగుతారు. దీంతో మొబైల్ నంబర్‌ను ఎవరికీ తెలియజేయాల్సిన అవసరం ఉండదు. దీంతో వ్యక్తిగత గోప్యత మరింత మెరుగుపడుతుందని మెటా చెబుతోంది.
ప్రైవసీకి ఉపయోగమే.. కానీ ప్రమాదాలు కూడా ఉన్నాయా?
యూజర్ల వ్యక్తిగత సమాచారం రక్షించడంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇదే వ్యవస్థను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మొబైల్ నంబర్ కనిపించకుండా కేవలం యూజర్‌నేమ్‌తో అకౌంట్ నడపడం వల్ల అసలు వ్యక్తిని గుర్తించడం కష్టమవుతుంది. దీంతో మోసగాళ్లు, హ్యాకర్లు, డిజిటల్ అరెస్ట్ ముఠాలు, ఫిషింగ్ నేరగాళ్లు నకిలీ పేర్లతో ప్రజలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని కేంద్రం భావిస్తోంది.
కేంద్రం ఎందుకు నోటీసు ఇచ్చింది?
ఈ ఫీచర్ వల్ల సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందనే కారణంతో మెటాకు నోటీసులు పంపింది. భారత్‌లో ఈ ఫీచర్‌ను అమలు చేసే ముందు భద్రతా అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని, అలాగే ప్రస్తుతం రోల్‌అవుట్‌ను నిలిపివేయాలని సూచించింది. యూజర్ల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని మెటా నిరూపించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎలా దుర్వినియోగం చేయవచ్చు?
ఉదాహరణకు, ఒక మోసగాడు ప్రముఖ సినీ నటి లేదా ప్రముఖ నటుడి పేరుతో యూజర్‌నేమ్ సృష్టించి మీకు మెసేజ్ పంపవచ్చు. ‘అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది’ అంటూ నమ్మించే ప్రయత్నం చేయవచ్చు. మొబైల్ నంబర్ కనిపించకపోవడంతో అది నిజమైన అకౌంట్ అని కొందరు నమ్మే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు పంపితే నేరుగా మోసగాళ్ల చేతిలో పడే ప్రమాదం ఉంది.
పాఠశాలలు, ప్రభుత్వ అధికారులు పేర్లతో కూడా మోసాలు
అలాగే ఒక స్కూల్ పేరుతో యూజర్‌నేమ్ సృష్టించి ‘మీ పిల్లల స్కూల్ ఫీజును ఈ కొత్త బ్యాంక్ ఖాతాలో జమ చేయండి’ అంటూ సందేశం పంపవచ్చు. అలాగే జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారి లేదా ప్రభుత్వ శాఖ పేరుతో కూడా నకిలీ మెసేజ్‌లు పంపే అవకాశం ఉంటుంది. అలాంటి సందేశాలను నిజమని నమ్మి డబ్బు బదిలీ చేస్తే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.
డిజిటల్ అరెస్ట్ మోసాలకూ అవకాశం
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాలు పెరుగుతున్నాయి. నకిలీ పోలీసు అధికారులు, సీబీఐ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల పేరుతో వీడియో కాల్స్, మెసేజ్‌లు పంపి ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారు. Username ఫీచర్ అమల్లోకి వస్తే ఇలాంటి మోసాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.
మెటా స్పందన ఏంటి?
మెటా ఈ ఫీచర్‌ను యూజర్ల గోప్యతను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు చెబుతోంది. నకిలీ అకౌంట్లను గుర్తించే భద్రతా వ్యవస్థలు, రిపోర్టింగ్ టూల్స్, వెరిఫికేషన్ వంటి అంశాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే భారత ప్రభుత్వం లేవనెత్తిన భద్రతా సందేహాలపై మెటా అధికారికంగా వివరణ ఇవ్వాల్సి ఉంది.

