కష్టపడి సంపాదించిన రూపాయి మరో రూపాయి తీసుకువస్తే ఆ ఆనందమే వేరు కదా.. ఫిక్స్ డ్ డిపాజిట్లలో వడ్డీ రూపంలో కొంత కలిసి వస్తున్నా.. దాని కంటే మెరుగైనది ఏదైనా ఉందా? అంటే ETF అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. FD కన్నా ETFలో మంచి రాబడులు ఉంటాయని వివరిస్తున్నారు.
పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ల (FD) వైపు ప్రజల ఆసక్తి రాను రాను తగ్గుతూ వస్తోంది. మెరుగైన రాబడుల కోసం ఇన్వెస్టర్లకు ఇతర ఆప్షన్లు ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెప్తున్నారు. మంచి రాబడుల కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెరుగుతున్నారు. అయితే ఇది కాకుండా, పెట్టుబడిపై మెరుగైన రాబడులను ఆర్జించేందుకు ETF మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. కొన్నేళ్లుగా ETFలు భారీగా ఆర్జించి పెడుతున్నాయి. ETF గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
ETF అంటే ఏంటి..?
సింపుల్ గా చెప్పాలంటే ఈటీఎఫ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతారు. ఈటీఎఫ్ ద్వారా కొన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది సాధారణంగా ఒక నిర్ధిష్ట సూచికను ట్రాక్ చేస్తుంది.
స్టాక్స్ మాదిరిగానే ఈటీఎఫ్ లను కూడా స్టాక్ ఎక్సేంజిల్లో కొనుగోలు చేసి విక్రయిస్తారు. ట్రేడింగ్ కాలంలో ఎప్పుడైనా ఈటీఎఫ్ ను విక్రయించవచ్చు. రాను రాను రిటైల్ ఇన్వెస్టర్లలో ఈటీఎఫ్ పై ఇంట్రస్ట్ పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం దాని భారీగా రాబడే. ఏడాది కాలంలో కొన్ని ఈటీఎఫ్ లు 100 శాతం వరకు రాబడిని తెచ్చిపెట్టాయి.
కమోడిటీలు, బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఈటీఎఫ్ ను ఉపయోగిస్తారు. సీఎన్ఎక్స్ నిఫ్టీ లేదా బీఎస్ఈ సెన్సెక్స్ వంటి సూచీలను ట్రాక్ చేసే ఫండ్లు ETF లు అని యాంఫీ స్పష్టం చేసింది. ప్రతీ ఈటీఎఫ్ కు ఫండ్ మేనేజర్లు కూడా ఉంటారు. దీంతో పెట్టుబడిదారుడు షేర్లను కొనడం లేదా అమ్మాల్సిన అవసరం ఉండదు.
మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే ఈటీఎఫ్ ఎందుకు బెటర్..
* షేర్ల కొనుగోలు, అమ్మకం తరహాలోనే ETFలను కూడా కొనవచ్చు, అమ్మవచ్చు.
* స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసేప్పుడు ETFపై ఓ కన్నేసి ఉంచవచ్చు. ఇందులో పెట్టుబడులు మరింత పారదర్శకంగా ఉంటాయి.
* స్టాక్స్ అమ్మే విధానం ద్వారా ETFను సులభంగా అమ్ముకోవచ్చు.
* ETF ద్వారా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు.
* ETF నుంచి వచ్చే డివిడెండ్లపై ఆదాయపు పన్ను ఉండదు.
* మ్యూచువల్ ఫండ్స్ కంటే ETFలు తక్కువ వ్యయ నిష్పత్తిని కలిగి ఉంటాయి.
* ETF ఉపసంహరణపై ఇన్వెస్టర్లు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇన్వెస్టర్లు తమ రిస్క్ ను బట్టి ఈటీఎఫ్ లను ఎంచుకోవచ్చు.
1. బాండ్ ETF: బాండ్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్టర్లకు నెలవారీ ఆదాయం లభిస్తుంది. ఈ వర్గంలో ప్రభుత్వ, కార్పొరేట్, మునిసిపల్ బాండ్లు ఉండవచ్చు.
2. స్టాక్ ఆధారిత ETF: స్టాక్ ఆధారిత ఈటీఎఫ్ లో వివిధ రకాల స్టాక్స్ ఉంటాయి, వాటి పనితీరును బట్టి ఇన్వెస్టర్లకు రాబడి వస్తుంది.
3. సెక్టార్ బేస్‌డ్ ETF: ఒక ఇండస్ట్రీ లేదా సెక్టార్ అనేది నిర్ధిష్ట పరిశ్రమ పనితీరును ట్రాక్ చేసే ఫండ్. ఉదాహరణకు ఇంధన రంగంలో పనిచేస్తున్న సంస్థను ఆ రంగానికి సంబంధించిన ETFలో చేరుస్తారు. ఐటీ, పీఎస్‌యూ, సీపీఎస్ఈ వంటి ఈటీఎఫ్ లకు ఆప్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఐటీ రంగానికి చెందిన ఈటీఎఫ్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.
4. కమోడిటీ బేస్‌డ్ ETF: గోల్డ్ ఈటీఎఫ్ కు ఇన్వెస్టర్లలో ఆదరణ ఉంటుంది. కమోడిటీ ఈటీఎఫ్ లు ముడిచమురు లేదా బంగారం వంటి కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పెద్ద ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్ లో కొంత భాగాన్ని తమ పోర్ట్ పోలియోలో ఉంచుకుంటారు.
5. కరెన్సీ ఆధారిత ETF: ఆ దేశ కరెన్సీ పెరుగుదల, తగ్గుదల తీరును అనుసరించి పెట్టుబడి పెట్టడాన్ని కరెన్సీ ETF అంటారు. కరెన్సీ ఈటీఎఫ్ తో చాలా ఉపయోగాలున్నాయి. కరెన్సీ విలువను అంచనా వేసేందుకు ఒక దేశం రాజకీయ, ఆర్థిక ధోరణులను ఉపయోగించవచ్చు.
6. ఇన్వర్స్ ETF: ఈక్విటీలను కుదించడం ద్వారా స్టాక్ డ్రాప్స్ నుంచి లాభం పొందేలా ఇన్వర్స్ ETFను రూపొందించారు. షేరు ధర తగ్గుతుందని భావిస్తే అమ్మడం, ఆ తర్వాత తక్కువ ధరకు కొనడం వలన రాబడులను ఆర్జించవచ్చు.