Mukesh Ambani: కుబేరుడు అప్పు ఇస్తాడు అని చదువుకున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చాడని మనం సినిమాల్లో చూసాం. కానీ ఆ కుబేరుడు ఎదుటివారిని అప్పు అడిగితే ఎలా ఉంటుంది? అబ్బే అదేం ప్రశ్నండి అని అంటారా.. ఇప్పుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటిదే. ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద కుబేరుడిగా పేరుపొందిన రిలయన్స్ కంపెనీల చైర్మన్ ముఖేష్ అంబానీ అప్పు కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. మన బ్యాంకుల వల్ల కాదని ఏకంగా విదేశాల్లో బ్యాంకులను సంప్రదిస్తున్నాడు. ప్రస్తుతం ఆ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 7,35 వేల కోట్ల పై మాటే. భారతదేశంలో మాత్రమే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ పేరు గడించాడు. అయితే అలాంటి ఆయన ఇప్పుడు అప్పు కోసం ప్రయత్నిస్తుండడం పారిశ్రామిక వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి రిలయన్స్ ముఖేష్ చేతిలోకి వెళ్లిన తర్వాత ఎన్నడూ కూడా వెనుకంజ వేసింది లేదు. పైగా తన తమ్ముడు అప్పుల్లో ఉంటే వాటిని తీర్చి సహాయం చేసిన ఘనత ముఖేష్ అంబానీది. కానీ అలాంటి అంబానీ ఇప్పుడు అప్పు కోసం విదేశీ బ్యాంకులను సంప్రదించడం ఒకరకంగా ఆశ్చర్యపరుస్తున్నది.
రెండు బిలియన్ డాలర్ల కోసం
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ రెండు బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో 16,386 కోట్ల రుణం కోసం విదేశీ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. గత వారం నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. అత్యంత విజయవంతమైన వ్యాపార సముదాయాలు ఉన్న రిలయన్స్.. తన విస్తరణను మరింత చేపట్టేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే విదేశీ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. తన కంపెనీల విస్తరణ కోసం రుణాలు కావలసి ఉండడంతో.. విదేశీ వాణిజ్య రుణమార్గాన్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది రిలయన్స్.
ఆ నివేదిక ప్రకారం..
బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం ఇలా తీసుకున్న రుణాన్ని మూలధన వ్యయం కోసం, ఇతర రుణాలను రీ ఫైనాన్స్ చేసేందుకు ఖర్చు చేస్తామని రిలయన్స్ వర్గాలు చెబుతున్నాయి. రుణం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులతో రిలయన్స్ సంప్రదింపులు జరుపుతోంది. ఒకే బ్యాంకు వద్ద అంత రుణం తీసుకోకుండా.. మూడు బ్యాంకుల్లో సమానమైన రుణాలు తీసుకోవాలని రిలయన్స్ భావిస్తోంది. గతంలో కొన్ని పరిశ్రమలకు మాత్రమే పరిమితమైన రిలయన్స్ 10 సంవత్సరాల నుంచి టెలికాం, కన్జ్యూమర్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ విభాగాల్లో కని విని ఎరుగని స్థాయిలో వృద్ధిని నమోదు చేస్తోంది. జియో, రిలయన్స్ రిటైల్, రిలయన్స్ ట్రెండ్స్ వంటి సంస్థలు జనాలకు బాగా చేరువయ్యాయి. ఇవి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ తో సమానంగా వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఇక ముకేశ్ అంబానీ ప్రధాన వ్యాపారాల్లో ముడి చమరు శుద్ధి కీలకమైనది. జియో, రిటైల్ వ్యాపారాలను ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీ నిర్వహిస్తున్నారు. మరో కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఎనర్జీ భాగానికి వయిస్తున్నాడు. విపరీతమైన వృద్ధి కారణంగా 2020లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ను రుణ విముక్తి కలిగిన సంస్థగా ముకేశ్ అంబానీ ప్రకటించాడు. అయితే టెలికాం, టెలికాం రంగంలో ఇంకా మరింత వృద్ధి కావాలి కాబట్టి ముఖేష్ నిధుల సేకరణకు నడుం బిగించారు.
రాబోయే 15 సంవత్సరాలలో..
ఇక త్వరలో ప్రారంభించబోయే కొత్త ఇంధన వ్యాపారంలో రాబోయే 15 సంవత్సరాలలో 75 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని ముఖేష్ నిర్వహించారు. ఇక ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా మూడు బిలియన్ డాలర్లకు ఆయన దక్కించుకున్నారు. అనంత్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ 2030 నాటికి రిలయన్స్ గ్రూప్ నకు 15 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెస్తుందని ఇటీవల ఒక విదేశీ సంస్థ అంచనా వేసింది. మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇందులో ఎటువంటి మార్పు ఉండదని ఆ సంస్థ స్పష్టం చేసింది. రిటైల్ విభాగంలో డీ మార్ట్ తిరుగులేని స్థానంలో ఉండగా.. దానిని బీట్ చేయాలని రిలయన్స్ భావిస్తోంది. అందులో భాగంగానే విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నామని చెబుతోంది.