New Car: కారు కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారా.. కొత్తకారు కొనాలనుకుంటున్నారా.. డబ్బులు సిద్ధం చేసుకున్నారా.. అయితే త్వరపడండి. కారు కొనేందుకు ఇదే మంచి తరుణం. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల రేట్లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటనలు కూడా ఇచ్చేశాయి. కొత్త ఏడాదిలో దాదాపు అన్ని కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈమేరకు ఇప‍్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. అందుకే కొత్త కారు కొనేవారికి ఇదే బెటర్ టైం.
పెరగిన విక్రయాలు..
ఈ ఏడాది (2023లో) అన్ని కంపెనీల కార్ల విక్రయాలు జోరుగా జరిగాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఆరంభం నుంచే కార్ల ధరలు పెంచేలా చాలా ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ 2024, జనవరి నుంచి కార్ల ధరల్ని పెంచనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసేసింది.
మారుతి బాటలో..
మారుతి బాటలోనే హ్యూందాయ్, టాటా, మహీంద్రా, ఆడి వంటి బ్రాండ్లు 2024 జనవరి నుంచి ధరలు పెరుగుతాయని ప్రకటించేశాయి. దీంతో కొత్త కార్లు కొనేవారు ఈ డిసెంబర్ నెలలోనే కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఫోక్స్ వ్యాగన్ కార్స్ ఇండియా కంపెనీ వివిధ మోడళ్ల ధరలను కొత్త ఏడాదిలో సుమారు 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2024, జనవరి 1 నుంచి ధరల పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది.
జర్మనీ కంపెనీ కూడా..
అలాగే జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సైతం వివిధ మోడళ్ల ధరలను పెంచబోతోంది. తమ కంపెనీ మోడల్‌ను బట్టి 2 శాతం మేర ధరల పెంపు ఉంటుందని ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరగడం ఇందుకు కారణమని పేర్కొంది.
మంచి తరుణం..
అందుకే కొత్తకారు కొనాలని ప్లాన్ చేసుకొని ఉంటే ఇప్పుడే కొనడం బెటర్. ఇంకో నెల ఆగితే ధరల పెరుగుదల ఎలా ఉంటుందనేది చెప్పలేం. కార్ల రేట్లలో పెరుగుదల ఎంతో కొంత ఆర్థిక భారం అయితే అవుతుంది.