Vivo X Fold 6 battery capacity: చైనా కంపెనీ Vivo తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Vivo X Fold 6 ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ప్రతినిధులు అధికారిక చైనా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ వివరాల ప్రకారం ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ అదిరిపోయే కెమెరా, మతిపోగొట్టే డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గురించిన పూర్తి వివరాల్లోకి వెళితె..
వివో ఎక్స్ ఫోల్డ్ 6 ఫోన్ లోపలి భాగంలో 8.02 అంగుళాల భారీ ఫోల్డబుల్ డిస్ ప్లే కనిపిస్తుంది. ఇది శామ్‌సంగ్ M14 లూమినెసెంట్ మెటీరియల్‌తో రూపొందింది. ఇది ఏకంగా 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో ఎలాంటి వాతావరణంలోనైనా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే చీకట్లో ఫోన్ వాడేవారి కోసం కూడా అల్ట్రా-డార్క్ మోడ్ తో కనిపించి కళ్లకు రక్షణగా ‘TÜV రైన్‌ల్యాండ్ గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 3.0’ సర్టిఫికేషన్‌ను కూడా ఇందులో చేర్చారు.
ఫోల్డబుల్ ఫోన్ల చరిత్రలోనే ఇందులో మొదటిసారిగా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను ప్రవేశపెట్టారు. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కోసం జైస్ అపో సూపర్ టెలిఫోటో లెన్స్ కనిపిస్తుంది. దీనివల్ల సుదూరంగా ఉండే దృశ్యాలను, కన్సర్ట్ వేదికలను ఎంతో స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. అంతేకాదు, రాత్రి వేళల్లో అద్భుతమైన పోర్ట్రెయిట్ల కోసం ఫుల్-ఫోకల్ లెంగ్త్ జూమ్ ఫ్లాష్ లైట్ కూడా ఉంది.
సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ వివో ఈ ఫోన్లో ఏకంగా 6,900mAh భారీ సిలికాన్ ఆనోడ్ బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. శామ్‌సంగ్, గూగుల్ ఫోల్డబుల్ ఫోన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. పర్ఫార్మెన్స్ పరంగా ది బెస్ట్ అనిపించుకునేలా ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 సూపర్ ఎడిషన్ చిప్‌సెట్ ఉండగా.. గత వెర్షన్ కంటే 111 శాతం మెరుగైన AI పర్ఫార్మెన్స్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బ్యాటరీ వినియోగాన్ని 56 తగ్గిస్తుందని అంటున్నారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 Fold ఓఎస్‌తో నడిచే ఈ ఫోన్‌లో ‘అటామిక్ వర్క్‌బెంచ్’, ‘AI లైట్ ఆఫీస్ టూల్’ వంటి ఫీచర్లు ఉన్నాయి.
