US Fed Meeting: ఉద్యోగాలు పోతున్నాయి. కంపెనీలు అడ్డగోలుగా కోతలు విధిస్తున్నాయి. మార్కెట్లలో కొనుగోళ్ళు తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో ఉద్దీపన చర్యలు తీసుకోవలసిన అమెరికన్ ఫెడరల్ బ్యాంకు బాదుడు మంత్రాన్ని పఠించింది. వడ్డీరేట్లను తగ్గించకపోగా.. 23 సంవత్సరాల గరిష్ట స్థాయిని కొనసాగించింది. దీంతో అమెరికా మాత్రమే కాకుండా ఇతర దేశాల కరెన్సీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బెంచ్ మార్క్ వడ్డీరేట్లు ఐదవ వరుస సమావేశంలోనూ 5.25 నుంచి 5.5 శాతం వద్దే కొనసాగించింది.. ఇదే సమయంలో అమెరికా అభివృద్ధి అంచనాను డిసెంబర్ నెలలో 1.4 శాతం నుంచి 2.1 వరకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 2022 మార్చి నెల నుంచి పాలసీ రేటును 5.25% పాయింట్లు మేర పెంచిన తర్వాత.. అమెరికాలో ధరల ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ American federal Bank వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఇష్టపడలేదు.
బుధవారం ఫెడరల్ బ్యాంక్ జెరోమ్ పావెల్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. వాస్తవానికి సమావేశానికి ముందు వడ్డీ రేట్లు తగ్గిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు ఏమాత్రం తగ్గించకపోగా.. గత స్థితిని కొనసాగించింది. మరోవైపు తదుపరి విధాన నిర్ణయాల కోసం చర్చించేందుకు ఏప్రిల్ 30, మే 1న సమావేశం అవుతామని ఫెడరల్ బ్యాంక్ ప్రకటించింది.” ద్రవ్యోల్బణం స్థిరంగా రెండు శాతం లక్ష్యానికి చేరుకునే వరకు వడ్డీరేట్లు తగ్గించే అవకాశం లేదని” ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది. వడ్డీ రేట్లను తగ్గించకపోవడంతో డాలర్ ఇండెక్స్ 0.34 శాతం తగ్గింది. కెనడా డాలర్ విలువ ఆరు రోజుల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో 2024 చివరి నాటికి వడ్డీ రేట్లలో కొంతవరకు తగ్గించే అవకాశం ఉందని ఫెడరల్ బ్యాంకు ప్రకటించిన నేపథ్యంలో.. బంగారం ధర ఒక శాతం పెరిగింది. స్పాట్ ఔన్స్ గోల్డ్ ధర ఒకటి పాయింట్ రెండు శాతం పెరిగి 2,183.02 డాలర్లకు చేరుకుంది. స్థిరమైన ద్రవ్యోల్బణం, రేట్ల తగ్గింపు ఉంటుందని నమ్మకం లేకపోవడంతో బంగారం ధరలు గతవారం దాదాపు ఒక శాతం తగ్గాయి.
ఇక ఫెడరల్ బ్యాంకు నిర్ణయంతో బుధవారం అమెరికన్ స్టాక్ మార్కెట్లు పెరిగాయి. ఈ ఏడాదిలో మొదటిసారిగా 5,200 పాయింట్ల స్థాయికి చేరుకున్నాయి. వడ్డీ రేట్ల విషయంలో ఫెడరల్ బ్యాంకు పూర్వ స్థితిని అనుసరించిన నేపథ్యంలో జాబ్ మార్కెట్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి..” బయట కొనుగోళ్ళు మందగించాయి. వస్తూత్పత్తికి డిమాండ్ తగ్గింది. ఇలాంటప్పుడు ఉద్యోగాలను కల్పించడం ఎలా సాధ్యం? ప్రజల కొనుగోలు శక్తి పెంచాలంటే వడ్డీరేట్ల విషయంలో ఫెడరల్ బ్యాంకు కాస్త ఉదారత చూపించాలి. ఐదవ సమావేశంలోనూ ఫెడరల్ బ్యాంక్ అలానే వ్యవహరించింది. అలాంటప్పుడు కొత్త ఉద్యోగాల సృష్టి ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటికే జాబ్ మార్కెట్ తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఇలాంటప్పుడు ఉద్యోగుల పై లే – ఆఫ్ కత్తి వేలాడుతూనే ఉంటుందని” కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఏడాది చివరి వరకు ఇదే స్థితి కొనసాగుతుందని ఫెడరల్ బ్యాంకు ప్రకటించిన నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా అమెరికన్ జాబ్ మార్కెట్ పెద్దగా మారదనే సంకేతాలు వినిపిస్తున్నాయి.